శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2019 (17:50 IST)

అంబటి రాయుడు పరువు నిలబెట్టాడు.. హైదరాబాదును గెలిపించాడు..

అంతర్జాతీయ క్రికెట్‌కు  రిటైర్మెంట్ ప్రకటించి.. ఆపై ఉపసంహరించుకున్న హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు. తాజాగా  హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన రాయుడు..  విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టున అలవోకగా గెలిపించాడు.

111 బంతులు ఎదుర్కొన్న రాయుడు 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 87 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు 21 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. హైదరాబాద్ బౌలర్ సందీప్ 35 పరుగులిచ్చి 4 వికెట్లు నేలకూల్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.  ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
 
మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక కెప్టెన్ మనీశ్ పాండే.. హైదరాబాద్‌ టీమ్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (7), అక్షథ్ రెడ్డి (21) నిరాశపరచగా.. మూడో స్థానంలో ఆడిన తిలక్ వర్మ (3) తేలిపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు.. ఆఖరి వరకూ ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా 50వ ఓవర్‌ వరకూ సహనంతో బ్యాటింగ్‌ కొనసాగించిన రాయుడు.. ఆఖర్లో మిలింద్ (36: 40 బంతుల్లో 4X4)తో కలిసి జట్టుని 198/9తో పరువు నిలిపాడు.
 
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కర్ణాటక 45.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కర్ణాటక  ఆటగాళ్లలో ఓపెనర్ దేవదత్త (60), కెప్టెన్ మనీశ్ పాండే (48) మినహా ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు.