1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

విశాఖపట్టణంలో దంచికొడుతున్న వర్షం - రెండో వన్డే నిర్వహణ సందేహమే?

cricket stadium rainwater
స్వదేశంలో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. ఇందులోభాగంగా, ఇప్పటికే ముంబై వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఇపుడు రెండో వన్డేకు విశాఖపట్టణం ఆతిథ్యమివ్వాల్సివుంది. కానీ, గత రెండు మూడు రోజులుగా వైజాగ్‌లో వర్షం దంచికొడుతుంది. ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభంకావాల్సిన రెండో వన్డే మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. వర్షం ఇదేవిధంగా కురిస్తే మాత్రం మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైన ఈ వర్షం రోజంతా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
విశాఖ నగరంలో శుక్ర, శనివారాల్లో కూడా విస్తారంగా వర్షం కురిసింది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పిం ఉంచారు. అయితే, ఆదివారం ఉదయం మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. వర్షం తగ్గినా మధ్యాహ్నం, రాత్రికి మళ్లీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో మ్యాచ్ నిర్వహణ కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే, మధ్యాహ్నానికి వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్‌ను ఆలస్యంగానైనా ఓవర్లు కుదించి నిర్వహించాలని భావిస్తున్నారు. వీలుపడకపోతే మాత్రం మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. మూడో వన్డే మ్యాచ్ చెన్నై వేదికగా జరుగుతుంది.