శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

వెస్టిండీస్‌కు ఘోర పరాభవం.. స్కాట్లాండ్ చేతిలో చిత్తు.. వరల్డ్ కప్‌కు నో ఎంట్రీ

west indies
ప్రపంచంలోని మేటి జట్లలో ఒకటిగా గుర్తింపు ఉన్న వెస్టిండీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్రికెట్ చరిత్రలో తొలిసారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుతం జరుగుతున్న 2023 ఐసీసీ వరల్డ్ కప్ అర్హత పోటీల్లో క్రికెట్ పసికూన స్కాట్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో అక్టోబరు, నవంబరు నెలల్లో భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచ కప్ టోర్నీకి దూరమైంది. స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురు కావడంతో వెస్టిండీస్ జట్టు తొలిసారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయింది. 
 
శనివారం హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా సూపర్ సిక్స్ తొలి మ్యాస్‌లో ఓటమితో మెగా ఈవెంట్ అర్హత అవకాశాలను చేజార్చుకుంది. గతంలో 1975, 1979 సంవత్సరాల్లో ప్రపంచ విజేతగా నిలించింది. 1990 దశకం తర్వాత వెస్టిండీస్ జట్టు ప్రతిష్ట మసకబారుతూ వచ్చింది. ఇపుడు వెస్టిండీస్ జట్టు లేకుండా వన్డే వరల్డ్ కప్ జరగడం చరిత్రలో ఇదే తొలిసారి.
 
క్వాలిఫయింగ్ రేసులో నిలవాలంటే శనివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్ చావోరేవో లాంటిది. అయితే, ఇంతటి కీలక మ్యాచ్‌లోనూ పసికూన చేతిలో 7 వికెట్ల తేడాతో దారుణంగా ఓడారు. ఆల్రౌండర్ బ్రాండన్ మెక్ ముల్లెన్ (3/32, 63) కరీబియన్ల పతనాన్ని శాసించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 181 పరుగులకు కుప్పకూలింది. 
 
ఆ తర్వాత 182 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన స్కాట్లాండ్ 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలిచింది. కనీసం ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించలేక చిన్నాచితకా జట్లతో క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడాల్సిన దుస్థితికి దిగజారింది. ఇపుడు ఆ జిల్ల జట్లపైనే గెలవలేక అత్యంత అప్రదిష్ట మూటగట్టుకుంది. రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఇపుడు ఏకంగా టోర్నీకి అర్హత సాధించలేకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.