శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 10 నవంబరు 2018 (13:25 IST)

నా గురించి ఏమన్నా పర్లేదు.. భారతీయ క్రికెటర్లు అన్నాడు.. అందుకే..? కోహ్లీ వివరణ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొత్త చిక్కొచ్చిపడింది. కోహ్లీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. స్వదేశీ ఆటగాళ్ల ఆటతీరు చూడటం ఇష్టం లేకపోతే.. దేశం వీడి వెళ్లిపొమ్మంటూ ఓ అభిమానిపై కోహ్లీ ఘాటు వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. ఇండియన్ క్రికెటర్ల ఆట తీరుపై సదరు అభిమాని చేసిన కామెంట్‌కు కోహ్లీ తీవ్రస్థాయిలో బదులివ్వడంతో వివాదం చెలరేగింది. 
 
నవంబర్‌ 5న తన 30వ పుట్టిన రోజు సందర్భంగా కోహ్లి తన పేరుతో ఉన్న యాప్‌ను ప్రారంభించాడు. ఈ యాప్‌లో ప్రస్తుత భారత ఆటగాళ్ల కంటే తాను ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లనే ఎక్కువ ఇష్టపడతానని ఓ అభిమాని పోస్టు పెట్టాడు. కోహ్లీని భారత ఆటగాళ్లు.. నెత్తినెట్టుకున్నారని..  అతడి ఆట స్థాయి కంటే ఎక్కువ గుర్తింపు వచ్చిందని కామెంట్ చేశాడు. 
 
అతడి ఆటలో ప్రత్యేకత ఏం లేదు. ఇలాంటి ఇండియన్‌ క్రికెటర్ల కంటే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రీడాకారుల ఆటతీరే తనకెంతో ఇష్టమని సదరు అభిమాని కామెంట్ చేశాడు. ఇందుకో కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు. స్వదేశీ ఆటగాళ్లు ఇష్టపడకపోతే.. దేశం వీడిపొమన్నాడు. కోహ్లీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు కోహ్లీని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు. ఈ నేపథ్యంలో విరాట్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నాడు. 
 
భారతీయులు అంటూ సదరు అభిమాని చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రమే తాను స్పందించినట్లు కోహ్లీ తెలిపాడు. అంతేకాని తన ఆటతీరు గురించి చేసిన కామెంట్‌పై మాత్రం నోరెత్తలేదని కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. అయినా తనపై ఇలాంటి కామెంట్లు రావడం ఇదేమీ కొత్తకాదని పేర్కొన్నారు. ఇక ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేసి హాయిగా పండగ వాతావరణాన్ని ఆస్వాదించండంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.