ట్వంటీ-20ల నుంచి ధోనీ అవుటా..? అంత లేదు.. విరాట్ కోహ్లీ
ట్వంటీ-20ల నుంచి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నాడని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కెప్టెన్ విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. టీ20ల నుంచి ధోనీకి ఉద్వాసన పలికారనడంలో నిజం లేదన్నాడు. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు తగినంత సమయమివ్వాలనే ఆలోచనతోనే ధోనీ తప్పుకొన్నాడని కోహ్లీ స్పష్టం చేశాడు.
వన్డేల్లో మహీ అంతర్భాగమని, 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో ధోనీ ఆడతాడని తేల్చి చెప్పాడు. తనకు తెలిసి ధోనీ విషయాన్ని ఇప్పటికే సెలెక్టర్లు కూడా తేల్చి చెప్పేశారు. అందుకే మరోసారి తాను వివరణ ఇవ్వాలనుకోవట్లేదని కోహ్లీ తెలిపాడు.
విండీస్, ఆసీస్‌లతో జరిగే టీ20 సిరీస్‌లకు జరిగిన జట్టు ఎంపికలో కూడా తాను పాల్గొనలేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు. కానీ జట్టులో ఇప్పటికీ ధోనీ అంతర్భాగమే. టీ20ల్లో యువ కీపర్ పంత్‌కు మరిన్ని అవకాశాలు వస్తే మంచిదన్నది ధోనీ ఉద్దేశమని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
కాగా ధోనీ బ్యాట్‌తో రాణించకపోయిన తనదైన కీపింగ్ స్కిల్స్‌తో బాగానే ఆకట్టుకున్నాడు. అయితే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన ధోనీ అంతగా రాణించకపోవడంతోనే టీ20ల నుంచి పక్కన బెట్టారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై అటు సెలెక్టర్లు, ఇటు కెప్టెన్ కోహ్లీ వివరణ ఇచ్చారు.