విశాఖ పిచ్‌కు పూజలు చేసిన ఎమ్మెస్కే.. నెట్టింట వీడియో వైరల్
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డేకు విశాఖ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా విశాఖలో జరిగిన వన్డే పిచ్‌పై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పూజలు నిర్వహించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రధాన పిచ్‌లో మూడు వికెట్లు పెట్టి పూజారితో ప్రత్యేక పూజలు నిర్వహించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఎమ్మెస్కేతో పాటు స్టేడియం ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగే పిచ్‌పైకి ఇతరులు ప్రవేశించడం నిషేధం. అలాంటిది.. ప్రత్యేక పూజలు చేయించడం.. ఆ కార్యక్రమంలో ఇతరులు పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మ్యాచ్‌కు ముందు వీటిని పరిశీలించే అవకాశం కెప్టెన్లకు వున్నా.. కఠినమైన నిబంధనలు వుంటాయి. అలాంటిది పిచ్‌పైకి ఏకంగా పూజారిని తీసుకెళ్లి పూజలు నిర్వహించడం కలకలం రేపుతుంది.
అయితే సదరు వీడియోలో స్టేడియంలో సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ పూజలు ఎప్పుడు జరిగాయనే దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు వస్తుండటంతో బీసీసీఐ ఎమ్మెస్కే ప్రసాద్‌ను వివరణ కోరే అవకాశం ఉంది. మరోవైపు ఉత్కంఠభరితంగా సాగినన మ్యాచ్ టై గా ముగిసిన సంగతి విదితమే.