బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (17:23 IST)

సెంచరీ వీరుడు విరాట్ కోహ్లీ... వాంఖేడ్‌లో సచిన్ సమక్షంలో విశ్వరూపం

Virat Kohli
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, బుధవారం ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును బద్ధలు కొట్టాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ వన్డే చరిత్రలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఒకే ఒక్క ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. తాను ఎంతగానో ఆరాధించే సచిన్ టెండూల్కర్ చూస్తుండగానే, సచిన్ చేసిన 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. 
 
ఈ మ్యాచ్‌లో రోహిత్‌ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ... ఒక్కో పరుగు కూడగడుతూ 59 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. అనంతరం  దూకుడు పెంచాడు. సౌథీ వేసిన 30వ ఓవర్లో  సిక్సర్‌ బాదిన విరాట్‌.. తర్వాత బౌల్ట్, ఫిలిప్స్‌, సౌథీలు వేసిన ఓవర్లలో ఫోర్లు కొట్టాడు. బౌల్డ్‌ వేసిన 36వ ఓవర్లో మరో ఫోర్‌ కొట్టి  సెంచరీకి చేరువయ్యాడు. 90లలోకి వచ్చాక కాస్త నెమ్మదించిన కోహ్లీ.. ఫెర్గూసన్‌ వేసిన 42వ ఓవర్లో డబుల్‌ తీసి 50వ శతకాన్ని పూర్తిచేశాడు. వన్డే క్రికెట్‌లో సచిన్‌.. 462 ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు చేయగా కోహ్లీ మాత్రం 280 ఇన్నింగ్స్‌లలోనే సెంచరీల అర్థసెంచరీలు చేయడం గమనార్హం.
 
వన్డేలలో అత్యధిక సెంచరీలు సాధించిన టాప్‌-5 బ్యాటర్లు:
విరాట్‌ కోహ్లీ (50.. 280 ఇన్నింగ్స్‌లలో)
సచిన్‌ టెండూల్కర్‌ (49.. 462 ఇన్నింగ్స్‌)
రోహిత్‌ శర్మ (31.. 253 ఇన్నింగ్స్‌)
రికీ పాంటింగ్‌ (30.. 365 ఇన్నింగ్స్‌)
సనత్‌ జయసూర్య (28.. 433 ఇన్నింగ్స్‌)
 
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (టాప్‌-5) 
సచిన్‌ - 100
కోహ్లీ - 80
పాంటింగ్‌ - 71
సంగక్కర - 63
కల్లీస్ - 62