మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 22 జులై 2017 (09:30 IST)

అమ్మాయిల క్రికెట్లో ఇంత భారీ సిక్సా... హర్మన్ ప్రీత్ దూకుడుకు అదిరిపోయిన గిల్ క్రిస్ట్

ఒకమ్మాయి ఒకే ఒక్క ఇన్నింగ్స్. మహిళల క్రికెట్లో నభూతో నభవిష్యత్ అనేలా, అబ్బాయిలు అసూయపడేలా.. క్రికెట్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్లేలియా మహిళా జట్టుకు దిమ్మదిరిగేలా.. టీమ్ ఇండియా గెంతులేసేలా.. అభిమానుల ఆనందంతో ఊగిపోయేలా చేసింది 28

ఒకమ్మాయి ఒకే ఒక్క ఇన్నింగ్స్. మహిళల క్రికెట్లో నభూతో నభవిష్యత్ అనేలా, అబ్బాయిలు అసూయపడేలా.. క్రికెట్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్లేలియా మహిళా జట్టుకు దిమ్మదిరిగేలా.. టీమ్ ఇండియా గెంతులేసేలా.. అభిమానుల ఆనందంతో ఊగిపోయేలా చేసింది 28 ఏళ్ల హర్మన్ ప్రీత్ కౌర్. 34 ఏళ్ల క్రితం జింబాబ్వేతో వరల్డ్ కప్‌లో కపిల్ దేవ్ ఇన్నింగ్స్‌ను మరిపించేలా సాగింది హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌.. అద్వితీయమైన ఆటతో యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది ఈ పంజాబీ అమ్మాయి. 
 
ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఆమె చరిత్రను లిఖించింది. ప్రస్తుత ఐసీసీ ప్రపంచకప్‌లో టీమిండియా తలరాతను మార్చేసింది. కఠిన ప్రత్యర్థి.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు మరిచిపోలేని.. నిద్రలేని రాత్రి ఎలా ఉంటుందో రుచి చూపింది. ప్రపంచకప్‌ నాకౌట్‌ పోరులో అటు పురుషులు.. ఇటు అమ్మాయిల విభాగంలో ఎవరికీ సాధ్యంకాని ఘనత సాధించింది. 115 బంతుల్లో 20 ఫోర్లు.. 7 సిక్స్‌లు.. 171 పరుగులతో అజేయంగా నిలిచింది. 
 
మహిళల క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడాలని.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని పరితపిస్తున్న చిరకాల వాంఛ నెరవేర్చేందుకు సిసలైన ప్రత్యర్థిపై సింహస్వప్నం లాంటి ఇన్నింగ్స్‌ ఆడింది. ఛాంపియన్‌ హోదాకు ఒక్క అడుగు దూరంలో నిలిపింది. ఆమె.. ఎవరో కాదు హర్‌ ‘మన్‌ ప్రీత్‌’. అందరి మనసులను గెలుచుకున్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌. ఆమె క్రికెట్‌ ప్రస్థానం నల్లేరుపై నడకేమీ కాదు!
 
హర్మన్‌ప్రీత్‌కు టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అంటే చాలా ఇష్టం. వీరూలాగే ‘బంతిని చూడు.. బలంగా బాదెయ్‌’ అన్న సిద్ధాంతం తనది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ద్రవిడ్‌లా నిలకడగా ఆడుతుంది. పట్టుదలలో యువీని మరిపిస్తుంది. మైదానంలో విరాట్‌లా దూకుడు కనబరుస్తుంది. మెరుపు ఫీల్డింగ్‌ చేస్తుంది. అలాగే చూడాలనిపించే ఆట తనది. లాగి పెట్టి సిక్స్‌ కొట్టగలదు. లాఘవంగా డ్రైవ్‌ చేయగలదు. ఒంటికాలిపై కూర్చొని ఆఫ్‌సైడ్‌లో నమ్మశక్యం కాని సిక్స్‌లు బాదగలదు. వాటిని చూసి ప్రత్యర్థి బౌలర్లు సైతం ఔరా! అని ఆశ్చర్యపడటం మామూలే! క్రీజును వీడి ముందుకొచ్చి లాగిపెట్టి కొట్టే షాట్లు పురుష క్రికెటర్లను సైతం మరిపిస్తాయి.
 
అమ్మాయిల క్రికెట్లో ఇంత బారీ సిక్సా అంటూ ఆస్ట్రేలియా మాజీ వీర బ్యాట్స్‌మన్ గిల్ క్రిస్ట్ హర్మన్ ఆటను స్టాండ్ లోంచి చూస్తూ బిత్తరపోయాడంటే అదీ హర్మన్ ఆటతీరు..జీవిత కాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్. అద్భుత షాట్‌లు ఆడావ్ అంటూ సెహ్వాగ్ అంతటివాడు ప్రశంసించాడు. నైపుణ్యం, శక్తిని కలగలసిన అద్బుత ఇన్నింగ్స్ నీకు వందనాలు హర్మన్ అంటూ వీవీఎస్ లక్ష్మణ్ వంటి కళాత్మక ఆటగాడు జేజేలు పలికాడు.
 
ఇంతమంది ప్రశంసలను ఒక్క రాత్రి ఆటతీరుతో సంపాదించుకున్న హర్మన్ ప్రీత్ భారతీయ మహిళలకు కొత్త స్ఫూర్తి ప్రదాత. ఆస్ట్రేలియాతో ఆట పూర్తయ్యాక హర్మన్‌ప్రీత్‌ తల్లి సతీందర్‌ కౌర్‌ ఉద్వేగంగా మాట్లాడారు. ‘మహిళలందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా. మా కుమార్తె మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసింది. మీరందరు కూడా మీ కుమార్తెలను వారి వారి కలల్లో జీవించేందుకు అవకాశం ఇవ్వండి. దయచేసి ఆడపిల్లల్ని కడుపులోనే చంపేయకండి’ అని అన్నారు.
 
ఇదీ ఒక యువతి ప్రదర్శించిన అసాధారణ శక్తి సామర్థ్యాలకు దేశం అర్పిస్తున్న నీరాజనాలు. టీమిండియా మహిళా జట్టును కోరుకుంటన్నది ఒక్కటే.. ప్లీజ్ ఇలాగే ఆండండి. ఆ చివరి అడ్డంకిని కూడా దాటండి. వరల్డ్ కప్‌ని గెలవండి. దేశం కోసం కాదు. మీ కోసం. మహిళా శక్తిని భారత్‌ ముందు ప్రదర్సించడం కోసం. గెలవండి.