అత్తింటి వేధింపులు.. నీళ్ళలో విషం కలిపి ఐదుగురి హత్య.. ఎక్కడ?
అత్తింటి వేధింపుల కారణంగా ఓ మహిళ నీళ్లలో విషం కలిపి ఐదుగురు కుటుంబ సభ్యులను హత్య చేసింది. ఓ ఇంటి కోడలితో మరో మహిళ కలిసి చేసిన ఈకుట్రలో కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు కేవలం మూడు వారాల వ్యవధిలో పిట్టల్లా రాలిపోయారు. ఈ ఘాతుకం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన శంకర్ కుంభరే, ఆయన భార్య విజయలు గత నెల 20వ తేదీన అనారోగ్యం పాలయ్యారు. అదే నెల 26న శంకర్, మరుసటి రోజు విజయ మరణించారు. ఇంతలో వారి ఇద్దరు కుమార్తెలు కోమల్, ఆనంద, కుమారుడు రోషన్‌ల ఆరోగ్యం కూడా విషమించింది. ఈ క్రమంలో అక్టోబరు 8న కోమల్, 14న ఆనంద, 15వ తేదీన రోషన్ ప్రాణాలు విడిచారు.
శంకర్ పెద్ద కుమారుడు సాగర్.. తల్లిదండ్రులు అనారోగ్యం గురించి తెలిసి ఢిల్లీ నుంచి వచ్చి తనూ అనారోగ్యం పాలయ్యాడు. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లిన కారు డ్రైవర్ రాకేశ్, సేవలకు వచ్చిన మరో బంధువు కూడా ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన చుట్టు పక్కల గ్రామాల్లో సంచలనం రేపింది. పోలీసులు 4 బృందాలతో దర్యాప్తు జరిపించారు.
ఈ వరుస మరణాలకు శంకర్ కోడలు సంఘమిత్ర, రోసా రాంటెక్ కారణమని తేల్చారు. శంకర్ చిన్న కొడుకు రోషన్, సంఘమిత్ర ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 5 నెలల క్రితం సంఘమిత్ర తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ బాధలో ఉన్న సంఘమిత్ర తనపై భర్తతోపాటు, అత్తింటివారి వేధింపులు పెరిగాయని భావించింది. దీంతో భర్తతో పాటు మొత్తం కుటుంబాన్ని అంతమొందించాలని భావించింది.
తన అత్తగారు విజయ పుట్టింటికి చెందిన రోసా సంఘమిత్రతో సాన్నిహిత్యం పెంచుకుంది. తన భర్తకు రావాల్సిన ఆస్తిని విజయ రాయించుకుందని అప్పటికే రోసా రగిలిపోతోంది. సంఘమిత్ర, రోసా కలిసి కుట్ర చేశారు. తెలంగాణకు వచ్చి తాగునీటిలో కలిపే విషాన్ని కొన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆ విషాన్ని నీటిలో కలిపి శంకర్ కుటుంబానికి ఇచ్చి ఐదుగురిని చంపేశారు. పొరపాటున ఆ నీళ్లు తాగిన కారు డ్రైవర్ ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో రోసాతో పాటు సంఘమిత్రను పోలీసులు అరెస్టు చేశారు.