సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (08:26 IST)

నువ్వుపోతేగానీ మాకు మనఃశాంతి ఉండదంటూ సన్నికాలు రాయితో అత్తపై దాడి... హత్య

murder
నువ్వుపోతేగానీ మాకు మనఃశాంతి ఉండదంటూ ఓ కోడలు అత్తపై సన్నికాలు రాయితో దాడి చేసింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణం అనకాపల్లిలోని కొత్తూరు పంచాయతీ దేవీనగర్‌లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు మేరకు... ఈ ప్రాంతానికి చెందిన ఈగల సింహాద్రమ్మ, సన్యాసిరావు అనే దంపతులకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు గణేశ్‌కు తుమ్మపాలకు చెందిన పూర్ణతో గత 2007లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దేవీ నగర్‌లో ఉన్న ఇంట్లో అత్త సింహాద్రమ్మ, కోడలు పూర్ణలు పక్కపక్క ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య కుటుంబ తగాదాలు తరచుగా జరుగుతున్నాయ. యేడాది క్రితం కూడా అత్తను పూర్ణ గాయపరిచింది. పోలీసులు, గ్రామపెద్దలు జోక్యం చేసుకుని వారి సమస్యను పరిష్కరించారు. 
 
ఇదిలావుంటే, సోమవారం ఇంట్లోకి కోతులు వచ్చాయి. దీంతో అత్తా కోడళ్లు మరోమారు ఘర్షణ పడ్డారు. దీంతో ఆగ్రహించిన పూర్ణ అత్తను దుర్భాషలాడుతూ, నీవు పోతేగానీ మాకు మనఃశాంతి ఉండదంటూ సన్నికాలు రాయితో అత్త తలపై బలంగా కొట్టింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఇరుగుపొరుగువారు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే  ఆమె మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. దీంతో సుభద్రమ్మ భర్త సన్యాసి రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న కోడలు పూర్ణ కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.