సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (15:18 IST)

నీట్‌కు చదవాలని తల్లి ఒత్తిడి.. బెల్టుతో తల్లిని చంపేసిన విద్యార్థిని

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని నవీ ముంబైలో దారుణం జరిగింది. ఓ టీనేజి అమ్మాయి తల్లిని కిరాతకంగా హత్య చేసింది. అయిరోలీ ప్రాంతంలో నివసించే 15 ఏళ్ల అమ్మాయి నీట్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. అయితే ఆ అమ్మాయిని చదవాలంటూ తల్లి పదేపదే ఒత్తిడి చేస్తూ వచ్చేది. దాంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.
 
ఈ నేపథ్యంలో జులై 27వ తేదీన ఆ అమ్మాయి ఫోన్ ఉపయోగించడం చూసి తండ్రి మందలించాడు. తండ్రిపై కోపగించిన ఆ బాలిక అక్కడికి దగ్గర్లోని మేనమామ ఇంటికి వెళ్లింది. కుమార్తెను వెతుక్కుంటూ ఆమె తల్లి కూడా తన సోదరుడి నివాసానికి వెళ్లింది. 
 
అక్కడ తన కుమార్తెను చూసి ఆమెను గట్టిగా తిట్టింది. ఈ వ్యవహారం పెద్దది కావడంతో పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు ఆ తల్లీకుమార్తెలకు సర్ది చెప్పి పంపించారు.
 
ఇంటికి చేరుకున్నప్పటికీ వారిద్దరి మధ్య సఖ్యత కుదర్లేదు. జులై 30న తండ్రి థానే వెళ్లాడు. ఆ సమయంలో తల్లి పుస్తకాలు తీసి చదవాలంటూ ఒత్తిడి చేయడమే కాకుండా, కుమార్తెపై చేయిచేసుకుంది. 
 
కత్తితో బెదిరించింది. దాంతో తనను తల్లి చంపేస్తుందని భయపడిన కుమార్తె తల్లిని బలంగా తోసేసింది. మంచం ఆమె తలకు తగలడంతో తల్లి మరింత కోపోద్రిక్తురాలైంది.
 
ఈ క్రమంలో కరాటే డ్రెస్సుకు ఉండే బెల్టు తల్లికి దొరకడంతో దాంతో కుమార్తెను కొట్టేందుకు సిద్ధమైంది. అయితే ఆ టీనేజి అమ్మాయి తల్లి చేతిలోని బెల్టును లాక్కుని, ఆమె మెడ చుట్టూ బిగించి చంపేసింది. 
 
అనంతరం తల్లి ఫోన్ నుంచి తండ్రికి, మేనమామకు, ఇతర బంధువులకు వాట్సాప్ చేసింది. గదిలోకి వెళ్లిన తల్లి తలుపు తీయడంలేదని వెల్లడించింది. ఆమె మేనమామ వచ్చి చూసే సరికి ఆ మహిళ అపస్మారక స్థితిలో పడిపోయి ఉంది. 
 
సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. దాంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాలిక మైనర్ కావడంతో జువెనైల్ హోంకు తరలించారు. మొదట ప్రమాదవశాత్తు మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం తర్వాత మరింత లోతుగా దర్యాప్తు జరపగా బాలిక తన నేరాన్ని అంగీకరించింది.