వివాహ వేళ విషాదం : సూర్యతాపం తట్టుకోలేక మృతి - ఆగిన పెళ్లి
బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంటిలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. ముహూర్త సమయానికి మరికొన్ని గంటలే ఉన్న సమయంలో వరుడు ఎండ వేడిని తట్టుకోలేక (వడదెబ్బ) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కొరటాల మండలం గుడ్లబోరి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ గ్రామానికి చెందిన గుండ్ల శ్యాంరావ్ - యశోద దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు తిరుపతి (32)కి మంచిర్యాల జిల్లా భీమిలికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. బుధవారం గుడ్లబోరి జరగాల్సిన పెళ్శికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, పెళ్లి పనుల్లో నిమగ్నమైవున్న తిరుపతి మంగళవారం వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు లోనయ్యాడు.
దీంతో మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. కానీ, అక్కడ తగ్గకపోవడంతో సాయంత్రానికి మెరుగైన వైద్యం కోసం కాగజ్ నగరులో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ, మంగళవారం అర్థరాత్రి ఒక్కసారిగా ఆరోగ్యం విషమించడంతో మంచిర్యాలలోని మరో ఆస్పత్రికి తరలించగా బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చనిపోయాడు.
కాగా, గుడ్లబోరి గ్రామ సర్పంచిగా ఉన్న గుండ్ల శ్యామ్ రావ్ చిన్న కుమారుడు గత యేడాది అనారోగ్యంతోనే మృతి చెందాడు. ఇపుడు పెద్ద కుమారుడు కూడా వడదెబ్బకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.