శనివారం, 14 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (11:40 IST)

ఔటర్ రింగ్‍ రోడ్డుపై కారుతో పాటు దగ్ధమైన వైద్యుడు...

హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఓ వైద్యుడు కారుతో పాటు దగ్ధమైపోయాడు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక గుర్తుతెలియని వ్యక్తులు చేశారా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడిని డాక్టర్ నేలపాటి సుధీర్‌ (39)గా గుర్తించారు. ఈయన స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా పొన్నూరు మండల కేంద్రంలోని శివాజీ నగర్. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డాక్టర్ సుధీర్ గత కొన్నేళ్లుగా కేపీహెచ్‌బీ పరిధిలోని సర్దార్‌ పటేల్‌ నగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసివుంటున్నారు. ఆయనకు భార్య సుప్రజ, తొమ్మిది సంవత్సరాల కుమారుడు ఉన్నారు. 
 
ఈయన నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. కొంత కాలం నుంచి ఆయన వైద్య వృత్తిని వదిలి మైనింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. శనివారం ఆయన బయటకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి కారులో ఒంటరిగా బయలుదేరారు. 
 
నానక్‌రామ్‌గూడ కూడలి ఔటర్ రింగ్ రోడ్డు‌పైకి చేరుకున్నారు. శంషాబాద్‌, హమీదుల్లానగర్‌ 135 కి.మీ వద్దకు రాగానే కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆ వైద్యుడు సజీవ దహనమయ్యారు. షార్ట్‌సర్యూట్‌ కారణంగానే కారులో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. 
 
ఈ ప్రమాదానికి కారు ఇంజిన్‌ మొరాయించిందా.. ఏదైనా కుట్ర, ఆత్మహత్య కోణం ఉందా అన్ని విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్యుడు ప్రమాదంలో మృతిచెందడంతో పొన్నలూరు మండల కేంద్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి.