1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (08:51 IST)

పాతబస్తీలో దారుణం : యువతిపై సామూహిక అత్యాచారం...

victim woman
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువతిపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారనికి పాల్పడ్డారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళతామని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... సూర్యాపేటకు చెందిన యువతి (21) తన సోదరుడు, తల్లితో కలిసి నివసిస్తోంది. శనివారం బాధితురాలికి తన సోదరుడితో ఏదో విషయమై గొడవ జరగ్గా అతడు ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో, యువతి మనస్తాపానికి గురై బస్సులో హైదరాబాద్ నగరానికి బయలుదేరింది. రాత్రి 10.40కి ఎంజీబీఎస్ బస్‌స్టాండులో దిగిన ఆమె సమీపంలోని టీకొట్టులో టీ తాగి అల్‌గంజ్ వైపు నడుచుకుంటూ వెళ్లింది. 
 
ఈ క్రమంలో గౌస్‌నగర్‌కు చెందిన ములకపెంట శ్రీకాంత్ (22), అఫ్జల్‌గంజ్‌కు చెందిన పానగంటి కాశీవిశ్వనాథు (32) ఆమెను ద్విచక్రవాహనంపై వెంబడించారు. బాధితురాలిని సమీపించిన వారు ఎక్కడికెళ్లాలని అడగ్గా ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నట్టు చెప్పింది. తాము పోలీస్ స్టేషన్ వద్ద దిగబెడతామని చెప్పి ఆమెను బైక్ ఎక్కించుకున్నారు. ఆ తర్వాత ఓ ప్రాంతంలో ఆమెకు ఐస్‌క్రీమ్ తినిపించి తమపై నమ్మకం కలిగేలా చేశారు.
 
ఆ తర్వాత బాధితురాలిని లేక్‌ వ్యూ హిల్స్ సమీపంలోని ఉన్న శ్రీకాంత్‌కు చెందిన స్క్రాప్ గోడౌన్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బైకుపై మరో చోటుకి తరలిస్తుండటంతో యువతి పెద్దపెట్టున అరిచింది. స్థానికులు అప్రమత్తం కావడం చూసిన నిందితులు యువతిని అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు.
 
దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. తనపై అఘాయిత్యం జరిగిన గోడౌన్‌ను యువతి పోలీసులకు చూపించింది. ఆ గోడౌన్.. నిందితుల్లో ఒకరైన శ్రీకాంత్‌ని తెలుసుకున్న వారు అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
 
అతడిచ్చిన సమాచారం ఆధారంగా కాశీవిశ్వనాథ్‌ను కూడా అరెస్టు చేశారు. నిందితులిద్దరూ బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు తేలింది. ఈ క్రమంలో యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.