సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (13:09 IST)

రామాలయంతో పాటు సీఎం ఆదిత్యనాథ్‌ను చంపేస్తాం...

ayodhya city
అయోధ్యలో కొత్తగా నిర్మించి రామాలయంతో పాటు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. దీంతో అయోధ్యతో పాటు.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య రామాలయానికి మరికొన్ని రోజుల్లో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపులు రావడం ఇపుడు కలకలం రేపుతున్నాయి. 
 
మరోవైపు, ఈ బెదిరింపులపై అప్రమత్తమైన పోలీసులు.. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితులిద్దరూ పేలుళ్లకు పాల్పడతామని సోషల్‌మీడియా వేదికగా పోస్టు పెట్టారు. సీఎంతో పాటు ఎస్‌టీఎఫ్‌ చీఫ్‌ అమితాబ్‌ యశ్‌ను కూడా హత్య చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టు ఆధారంగా నిందితులకు సంబంధించిన మెయిల్‌ అడ్రస్‌లను కనుగొన్నారు. 
 
వీటిపై సాంకేతిక విశ్లేషణ అనంతరం నిందితులను ఓం ప్రకాశ్‌, తాహర్ సింగ్‌లుగా గుర్తించారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేశారు. గోండాకు చెందిన వీరిద్దరూ పారామెడికల్‌ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తున్నారని తెలిపారు. తాహర్‌ సింగ్‌ మొయిల్స్‌ను సృష్టించగా.. ప్రకాశ్‌ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది.