శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 6 జనవరి 2022 (15:33 IST)

ఏపీ లారీలో ఉప్పు బస్తాలతో 3 కోట్లకు పైగా విలువైన గంజాయి స్మగ్లింగ్, పట్టివేత

మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్‌లో అక్రమంగా తీసుకువస్తున్న 1575 కిలోల గంజాయిని డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇన్ఫర్మేషన్) పట్టుకుంది. బుధవారం నాడు DRI ఇండోర్ జోనల్ యూనిట్, ఇండోర్ ప్రక్కనే ఉన్న జాతీయ రహదారిపై ఇద్దరు స్మగ్లర్లను పట్టుకుని, 1575 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.3.15 కోట్లు.

 
కవర్ చేసిన కార్గో ట్రక్కులో భారీ మొత్తంలో దాచిన గంజాయి రవాణా చేస్తున్నట్లు DRI ఇండోర్ యూనిట్‌కు సమాచారం అందింది. DRI బృందం అనుమానాస్పద ట్రక్కును పర్యవేక్షించి ఇండోర్ హైవే సమీపంలో ట్రక్కును నిలిపివేసింది. ఉప్పు బస్తాల్లో దాచిన 1575 కిలోల గంజాయిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి ట్రక్కులో తీసుకువస్తుండగా, దానిని స్వాధీనం చేసుకున్నారు.

 
ట్రక్కు డ్రైవర్‌తో సహా ఇద్దరు నిందితులు గంజాయిని స్మగ్లింగ్ చేసినట్లు అంగీకరించారు. ఇద్దరినీ ఎన్‌డిపిఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ ఇండోర్‌లోని ఎన్‌డిపిఎస్ కోర్టులో హాజరుపరిచి విచారిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు డీఆర్‌ఐ మొత్తం 8300 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు కూడా చెబుతున్నారు. కాగా ఏపీ రాష్ట్ర సరిహద్దులు దాటి ఆ లారీ ఇంతదూరం ఎలా వచ్చింది... వారికి సహకరిస్తున్నవారు ఎవరు అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.