ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (13:58 IST)

నువ్వులేని ఈ జీవితం వ్యర్థమంటూ భర్త ఆత్మహత్య

suicide
ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ విషాదం జరిగింది. డెంగీ వ్యాధితో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కన్నుమూసింది. భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త కూడా 24 గంటలు తిరగకముందే తన ఇంట్లోనే ఫ్యానుకు ఊరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కళ్యాణదుర్గం శంకరప్ప తోటకు చెందిన గణేష్ (23) అనే యువకుడి తాపీ పని కోసం బెంగుళూరుకు వెళ్లాడు. అక్కడ గగనశ్రీ (24) అనే యువతితో పరిచయమైంది. ఈ యువతినిని మంగుళూరులోని బీటెక్ కోర్సులో చేర్పించారు. 
 
అయితే, గణేష్‌తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ వచ్చిన గగనశ్రీ తన ధ్యాసంతా ప్రియుడిపైనే పెట్టింది. మంగళూరులోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. పెద్దలకు తెలియకుండా గగనశ్రీ తన చదువును రెండో సంవత్సరంలోనే ఆపేసి ఐదు నెలల క్రితం తన భర్తతో కలిసి కళ్యాణదుర్గానికి వచ్చింది. 
 
ఈ క్రమంలో గగనశ్రీ అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా డెంగీ ఫీవర్ అని తేలింది. మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరలిస్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్పటికే గగనశ్రీ మూడు నెలల గర్భిణి అని తేలింది. తన భార్య మృతదేహాన్ని కళ్యాణదుర్గానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. 
 
అయితే, తన భార్య డెంగీ జ్వరంతో మృతిచెందడాన్ని గణేష్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో గురువారం సాయంత్రం తమ ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని కాపాడి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, అతను మార్గమధ్యంలోనే చనిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.