Boycott Turkey: పాకిస్తాన్‌కి మద్దతిచ్చిన టర్కీకి ఇండియన్స్ షాక్
Boycott Turkey బోయ్ కాట్ టర్కీ అనేది ప్రస్తుతం భారతదేశంలోని ప్రజలు అమలు చేస్తున్నారు. భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం విషయంలో పాకిస్తాన్ దేశానికి వెన్నుదన్నుగా నిలిచిన టర్కీకి భారత ప్రజలు బుద్ధి చెబుతున్నారు. 2023లో భారీ భూకంపంతో టర్కీ అతలాకుతలమైనప్పుడు సుమారు 6 లక్షల డాలర్ల సాయం అందించిన భారతదేశానికి వ్యతిరేకంగా టర్కీ పాకిస్తాన్ దేశానికి మద్దతిచ్చింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహంతో వున్నారు.
ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్, మార్బుల్స్ నిలిపివేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. భారతదేశానికి వచ్చే మార్బుల్స్ లో 70 శాతం టర్కీ దేశం నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు వ్యాపారులు తీసుకున్న నిర్ణయంతో టర్కీకి వచ్చే ఆదాయం భారీగా గండి పడుతుంది. అంతేకాదు... టర్కీ దేశంలో పర్యటించే ఆలోచనలు సైతం వెనువెంటనే వెనక్కి తీసుకుంటున్నారు.
భారత్ పర్యాటకుల ద్వారా టర్కీకి గత ఏడాది 3 వేల కోట్లు
గత ఏడాది టర్కీని సుమారు 3.3 లక్షల మంది భారతదేశ పర్యాటకులు సందర్శించారు. ఈ సంఖ్య 2023తో పోల్చుకుంటే 108 శాతం అధికం. వీరి ద్వారా టర్కీకి గత ఏడాది రూ.3,000 కోట్లు వచ్చాయి. ఐతే ప్రస్తుతం టర్కీ తీసుకున్న నిర్ణయంతో భారతదేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా వున్నారు. టర్కీని సందర్శించాలన్న తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారు.
ఇప్పటికే 50% బుకింగ్స్ రద్దు చేసుకున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ స్థాయిలో టర్కీకి షాక్ ఇచ్చారు. టర్కీని సందర్శించడానికి బదులుగా ఫ్రాన్స్, లండన్ వంటి ఇతర భారతదేశ స్నేహ దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తమ్మీద పాకిస్తాన్ దేశానికి మద్దతు ఇచ్చి టర్కీ భారీ మూల్యం చెల్లించుకుంటోంది.