1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 మే 2025 (10:50 IST)

ప్రజల నమ్మాకాన్ని మోడీ కోల్పోయారు.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలి.. నెటిజన్ల డిమాండ్

narendra modi
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది భారత పర్యాటకులను హతమార్చారు. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు యుద్ధానికి దిగాయి. ఈ క్రమంలో ఉన్నట్టుండి యుద్ధాన్ని ఆపేసినట్టు ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ విషయాన్ని భారత్ అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ కాల్పుల విరమణపై భారత్ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. పాకిస్థాన్‌పై విజయం సాధించేంత వరకు తన దూకుడును కొనసాగించివుంటే బాగుండేదని అత్యధిక మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. భారత ప్రకటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 
 
కాల్పుల విరమణ వార్త వెలువడిన వెంటనే సోషల్ మీడియా వేదికల్లో భిన్నమైన స్పందనలతో హోరెత్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని నివారించడం ముఖ్యమని కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేస్తే, మరికొందరు మాత్రం పాకి‌స్థాన్‌పై విజయం సాధించేంత వరకు యుద్ధాన్ని కొనసాగించివుంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. 
 
తాము ఈ నిర్ణయాన్ని ఊహించలేదని, అమెరికా ఒత్తిడికి తలొగ్గుతారని అస్సలు అనుకోలేదని, పాకిస్థాన్‌ను ఆక్రమించి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందని రుద్రరాజు అనే యూజర్ ట్విటీ చేశాడు. పాకిస్థాన్‌ను అస్సలు నమ్మవద్దని, వారిని నాశనం చేయాల్సిందేనని వినోద్ కౌల్ అనే మరో యూజర్ వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని, యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలని, ఆయన ప్రధాని అభ్యర్థి అయితేనే ఓటు వేస్తానని కల్పేష్ అనే మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మోదీ తన జీవితంలో అతిపెద్ద తప్పుచేశారని విమర్శించారు. ఈ కాల్పుల విరమణ వల్ల శాశ్వత శాంతి నెలకొంటుందా అని చాలా మంది ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం వల్ల పాకిస్థాన్ వైపు నుంచి మరోమారు చొరబాట్లు జరగవని హామీ ఉంటుందా?
 
అమాయకుల ప్రాణాలు కోల్పోరని ప్రభుత్వాలు భరోసా ఇవ్వగలవా అని ప్రశ్నించారు. పహల్గాం ఘటన పునరావృతం కాకుండా చూడగలరా? ఆప్తులను కోల్పోయిన వారి గాయాలు మానతాయా? పర్యాటకులకు భద్రత ఉంటుందా? లేక అది రాజకీయ నాయకులకే పరిమితమా? వీటన్నింటికీ సమాధానం అవును అయితే శాంతికి అర్థం ఉంటుందని పలువురు నెటిజన్లు స్పందించారు.