తమిళనాడు ఎన్నికల్లో 30 పార్టీలు పోటీ, తేలింది 9 పార్టీలే, గల్లంతైనవారి లిస్ట్ ఇదే
దేశంలో ఎక్కడా లేనన్ని పార్టీలు తమిళనాడులో ఉన్నాయి. ఎన్నికలు రాగానే ఆ పార్టీలన్నీ తెగ హడావిడి చేస్తుంటాయి. పొత్తుల కోసం వెంపర్లాడుతుంటాయి. కొన్నిసార్లు ఏ పార్టీ ఎవరితో జతకడుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. తాజా ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. చిన్నా చితకా పార్టీలన్నీ ఉనికి చాటుకోలేక చేతులెత్తేశాయి. ధర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ అని ఎవరికి వారు ప్రచారం చేసుకున్నా వారికంత సీన్ లేదని తేలిపోయింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో నాలుగైదు పార్టీల మధ్యే పోటీ ఉంటుంది. కానీ దక్షిణాదిలో పరిస్థితి భిన్నం. తమిళనాడులో అయితే లెక్కలేనన్ని పార్టీలు ఎన్నికల బరిలో నిలుస్తుంటాయి. తాజా ఎన్నికల్లో 30కి పైగా పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. కొత్త పార్టీలు డిఎంకేతో జతకడితే మరికొన్ని పార్టీలు అన్నాడిఎంకేతో పొత్తు పెట్టుకున్నాయి.
కొన్ని పార్టీలు దినకరన్, కమలహాసన్ పార్టీలతో కలిసి పోటీ చేశాయి. ఈసారి పోటీ అన్నాడిఎంకే, డిఎంకే మధ్యే జరిగినా కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీతి మయ్యం, ఎంఎన్ ఎం కూటమి.. దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం.. నాన్ తమిళర్ కక్షిలు ఒంటరిగా పోటీలోకి దిగాయి.
టిక్కెట్లురాని వారు చాలామంది ఈసారి దినకరన్ పార్టీలో పోటీకి దిగారు. దాంతో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలుచుకోలేక చతికిలబడ్డారు. జయలలిత మరణం తరువాత ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన దినకరన్ ఈసారి నియోజకవర్గం మారినా ఓటమిపాలయ్యారు.
సినీ నటుడు విజయ్ కాంత్ నేతృత్వంలో 60 సీట్లలో, ఎంఐఎం మూడు సీట్లో పోటీ చేసినా ఉనికిని కూడా చాటుకోలేకపోయాయి. దినకరన్ పార్టీ 160 సీట్లలో బరిలోకి దిగినా ఎక్కడా కనీసం పోటీని సైతం ఇవ్వలేకపోయింది. ఇక కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీతిమయ్యం పార్టీ పరిస్థితి కూడా అంతే.
కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కమల్ హాసన్ మాత్రమే గట్టి పోటీ ఇచ్చారు. ఆయనతో జట్టు కట్టి పోటీకి దిగిన శరత్ కుమార్ పార్టీ ఆలిండియా సమద్దువ మక్కల్ పార్టీల ప్రభావం పెద్దగా లేవు. బిజెపి మూడు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డిఎంకేతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేస్తే 17 సీట్లలో గెలుపొందింది. డిఎంకే, అన్నాడిఎంకే కాకుండా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కొన్నిచోట్ల గట్టి పోటీ ఇవ్వగలిగింది.
మిగతా పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేక చతికిలబడ్డాయి. సినీ దర్సకుడు సి.మాన్ నేతృత్వంలోని పార్టీ 234 స్థానాల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకుంది. తమిళనాట 30కి పైగా పార్టీలు నిలిచినా అసెంబ్లీకి 9 పార్టీలే వెళుతుండడం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది.