మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (12:18 IST)

తిరుమలలో దర్జాగా మద్యం - గంజాయి సేవనం... సీసీ టీవీ కెమెరాలు ఏమయ్యాయి...?

భద్రతపరంగా తిరుమల అత్యంత సున్నితమైన ప్రదేశం. అంతర్జాతీయ స్థాయిలో ప్రాచూర్యం పొందిన తిరుమల క్షేత్రంలో చిన్న ఘటన కూడా పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. అందుకే శ్రీవారి క్షేత్రాన్ని వెయ్యి కళ్ళతో కాపలా కాయా

భద్రతపరంగా తిరుమల అత్యంత సున్నితమైన ప్రదేశం. అంతర్జాతీయ స్థాయిలో ప్రాచూర్యం పొందిన తిరుమల క్షేత్రంలో చిన్న ఘటన కూడా పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. అందుకే శ్రీవారి క్షేత్రాన్ని వెయ్యి కళ్ళతో కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలకు ఉగ్రవాదుల నుంచి కూడా ముప్పు పొంచివుందన్న హెచ్చరికలు ఎప్పటికప్పుడు కలవరపరుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పవిత్ర పుణ్యక్షేత్ర భద్రత కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ అడపాదడపా భద్రత, నిఘా వైఫల్యాలను ఎత్తిచూసే ఉదంతాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
 
శ్రీవారి ఆలయ నాలుగు మాఢ వీధుల్లోనే ఆరుగురు యువకులు, పట్టపగలు మద్యం సేవిస్తూ మీడియాకు పట్టుబడిన ఉదంతం కలకలమే రేపింది. మద్యం, సిగరెట్లు, మాంసం, గుట్కాలు వంటివి తిరుమలకు తీసుకెళ్ళడం నిషేధం ఉంది. ఆ యువకులు ఎలాగోలా పోలీసుల కన్నుగప్పి తిరుమలకు తీసుకెళ్ళారు. బస్సు వెనుక ఎక్కడో దాచిపెట్టామని వాళ్ళే చెప్పారు. అణువణువూ వెతకడం పోలీసులకైనా సాధ్యం కాదు కనుక దాన్ని పక్కనపెడతాం. 
 
వరాహస్వామి ఆలయానికి అత్యంత సమీపంలో, మాఢ వీధుల్లోని గ్యాలరీనే బార్‌గా మార్చేసి దర్జాగా ఎండుచేపలు తెచ్చుకుని, మందుబాటిళ్ళు ముందు పెట్టుకుని కూర్చున్నారంటే తిరుమలలోని నిఘాపైనవాళ్ళకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంత ధైర్యంగా అక్కడ కూర్చుని మద్యం సేవిస్తున్నారంటే ఇది ఈ ఒక్కరోజుకే పరిమితమైన వ్యవహారం అనుకునేందుకు వీల్లేదు. చాలా రోజులుగా ఆ పద్ధతికి అలవాటు పడి ఉండాలి. ఒకరోజు తప్పు చేస్తే నిఘాకు చిక్కకపోవచ్చు. అదే తప్పును తరచూ చేస్తున్నాకూడా నిఘాకు దొరక్కపోవడమే ఆశ్చర్యం.
 
అర్చక భవన్‌ పక్కనే ఉన్న మరుగుడదొడ్ల వద్ద మద్యం, గంజాయి సేవనం ఎప్పటి నుంచో జరుగుతోందని స్థానికులు చెపుతున్నారు. బయట నుంచి వచ్చి అనధికార హాకర్లుగా పనిచేస్తున్న యువకులే ఇలా బరితెగించగలరు. స్థానికులెవరూ అలా చేయరు. ఇప్పుడు పట్టుబడిన వారిలోనూ అంతా బయటి వారే ఉన్నట్లు చెబుతున్నారు. హోటళ్ళలోనూ, దుకాణాలలోనో పని చేయడానికి వచ్చి తిరుమలలోనే తిష్టవేసి ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి వారిపైన నిఘా లేదు. ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. అనధికారిక వ్యక్తుల వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రతి సమీక్షలోనూ ఎవరో ఒకరు చెబుతూనే ఉన్నారు. అయినా వారిని కట్టడి చేయడానికి చర్యలు లేవు. కనీసం వారిపై సరైన నిఘా వ్యవస్థ లేదు.
 
తిరుమలలో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేంత నిఘా ఉండాలి. అప్పుడప్పుడూ అధికారులు చేసే ప్రకటనలు అలా అనిపిస్తాయి కూడా. సీసీ కెమెరాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే మాఢా వీధుల్లో జరిగిన ఉదంతాన్ని కూడా ఎందుకు పసిగట్టలేకపోయారనేది ప్రశ్న. ఈ ఘటన జరిగిన రెండో రోజే ఒక కాటేజీలో రూ.2.30 లక్షలు చోరీ అయ్యాయి. ఈ దొంగ ఎవరో కూడా గుర్తించలేదు. అసలు కెమెరాలు పని చేస్తున్నాయా? పనిచేస్తున్నా సిబ్బంది వాటిని నిరంతరం గమనిస్తున్నారా? వంటి ప్రశ్నలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. ఇక ఏ మాత్రం తాత్సారం చేయకూడదు. అనధికార వ్యక్తులకు సంబంధించి స్పష్టమైన విధానం, వ్యూహంతో పోలీసులు తితిదే నిఘా సిబ్బంది రంగంలోకి దిగాలి.