బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: గురువారం, 17 ఆగస్టు 2017 (17:37 IST)

పళనిస్వామి షాక్... శశికళ తను తీసుకున్న గొయ్యిలో తనే...

తమిళనాడులో శశికళ-దినకరన్‌లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి షాక్‌ల మీద షాకులిస్తున్నారు. పన్నీర్ సెల్వం ఎన్నాళ్లగానో చేస్తున్న డిమాండ్లకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనితో శశికళ-దినకరన్ లకు దిమ్మతిరిగే షాకే అవుతోంది. ఆయన

తమిళనాడులో శశికళ-దినకరన్‌లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి షాక్‌ల మీద షాకులిస్తున్నారు. పన్నీర్ సెల్వం ఎన్నాళ్లగానో చేస్తున్న డిమాండ్లకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనితో శశికళ-దినకరన్ లకు దిమ్మతిరిగే షాకే అవుతోంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు చూస్తే... దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణకు ఆదేశించారు. మాజీ రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో ఈ విచారణ సాగుతుంది. 
 
జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ జయ స్మారక భవనంగా మార్చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇవి రెండూ కూడా శశికళకు సుతారమూ ఇష్టంలేనివి. జయ మరణంపై విచారణకు ఆదేశిస్తే తను ఆత్మహత్య చేసుకుంటానని అప్పట్లో ఆమె వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోవైపు జయలలిత మరణించిన తర్వాత ఆమె ఇంట్లోనే శశికళ తిష్టవేశారు. పూర్తిగా ఆ ఇంటిని తన ఆధీనంలోకి తీసుకుని అక్కడి నుంచే తన కార్యకలాపాలన్నీ సాగించారు.
 
అప్పట్లో ఎమ్మెల్యేలందరి చేత సంతకాలు చేయించి తను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు పావులు కదిపారు. ఐతే అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో జైలుపాలయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై ప్రతీకారంతో ఊగిపోయిన శశికళ తన అనుయాయుడైన పళనిస్వామికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టారు. ఐతే ఆ పదవిలో తన మేనల్లుడు దినకరన్ ను కూర్చోబెట్టేందుకు ప్రణాళిక వేశారు. జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నియోజకవర్గం నుంచి పోటీకి దింపారు. ఐతే అతడు కాస్తా డబ్బులు పంచేసి అడ్డంగా దొరికిపోయాడు. దీనితో అక్కడి ఎన్నికలను ఈసీ సస్పెండ్ చేసింది. 
 
దినకరన్ బెయిలుపై ప్రస్తుతం బయట వున్నాడు. ఐతే ఈ పరిణామాలన్నీ బేరీజు వేసుకున్న పళనిస్వామి తన పదవికే ఎసరుపెట్టేందుకు శశికళ ప్రయత్నించారని కనిపెట్టేశారు. ఇక అక్కడనుంచి తిరుగుబాటు నేతగా బయటకు వెళ్లిన పన్నీర్ సెల్వంకు దగ్గరయ్యేందుకు పావులు కదిపారు. ఇటీవలే ఇద్దరూ కలిసి ప్రధానమంత్రి మోదీని కూడా కలిసి వచ్చారు. అక్కడ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ సయోధ్య ఫలితంగానే ఇప్పుడు పళనిస్వామి నిర్ణయాలు అనే వాదన వినబడుతోంది. మొత్తమ్మీద శశికి ఇది గట్టి ఎదురుదెబ్బ అని చెప్పక తప్పదు.