శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2019
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (16:24 IST)

టాలీవుడ్ రౌండ్ 2019 : పడిలేచిన కెరటాలు....

తెలుగు చిత్రపరిశ్రమకు 2019 సంవత్సరం చేదుతీపి జ్ఞాపకాలను మిగిల్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా, అనేక భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చినప్పటికీ.. అవి బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అయితే, కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించాయి. అలాగే, పలువురు దర్శకులు, హీరోలు, సంగీత దర్శకులకు కూడా ఈ  సంవత్సరంలో పడిలేచిన కెరటంలా దూసుకొచ్చారు. అలాంటివారిలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సంగీత దర్శకుడు మణిశర్మ, హీరోలు రామ్, సాయిధరమ్ తేజ్, నాగ చైతన్య వంటి హీరోలు ఉన్నారు. ఈ వివరాలను ఓసారి తెలుసుకుందాం. 
 
2019 సంవత్సరం ఫిల్మ్ నగర్ వార్తల్లో బాగా నిలిచిన చిత్రం "ఇస్మార్ట్ శంకర్". ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకుడు. పుష్కరకాలంగా సరైన హిట్ లేక తీవ్ర నిరాశలో కూరుకున్న పూరీకి ఈ చిత్రం సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. అటు విజయంతో పాటు.. ఇటు కాసుల వర్షం కురిపించింది.
 
అలాగే, ఒకపుడు ఇండస్ట్రీ సంగీత రారాజుగా పేరుగడించిన సంగీత దర్శకుడు మణిశర్మ. ఈ మధ్యకాలంలో ఆయన కనుమరుగైపోయారు. కానీ, ఈ యేడాది ఈ మెలోడీ బ్రహ్మకు మళ్లీ తెరపైకి వచ్చాడు. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి అందించిన సంగీతం సూపర్బ్‌గా అనిపించింది. ఈ చిత్రంతో ఆయన మళ్లీ ట్రాక్‌లో పడ్డారు. ఫలితంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చే గోల్డెన్ ఛాన్స్‌ను కొట్టేశాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో 13 యేళ్ల తర్వాత చిత్రంరానుంది. అలాగే, 'నేను శైలజ' అనే చిత్రంతో గాడితప్పిన హీరో రామ్‌కు ఓ మంచి విజయాన్ని పూరీ జగన్నాథ్ అందించడమే కాకుండా యంగ్ హీరోల రేస్‌లో ముందు వరుసలో నిలబెట్టేలా చేశాడు.
 
 
అలాగే, యువ హీరోలు నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, నిఖిల్, తమిళ హీరో కార్తి వంటి హీరోలు కూడా 2019లో బౌన్స్ బ్యాక్ అయ్యారు. 'మజిలీ' చిత్రంతో నాగచైతన్య ఓ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 'చిత్రలహరి', 'ప్రతిరోజూ పండగే' చిత్రంతో సాయిధరమ్ తేజ్, 'అర్జున్ సురవరం' చిత్రంతో నిఖిల్, 'ఖైదీ', 'దొంగ' చిత్రాలతో తమిళ హీరో కార్తిలు తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. అలాగే, హీరోయిన్ మెహ్రీన్ కూడా "ఎఫ్-2" చిత్రంతో విజయాన్ని నమోదు చేసుకుంది. వీరితో పాటు మిగిలిన సినీ ప్రముఖులంతా 2020లో కూడా బాగా రాణించాలని ఆశిద్ధాం.