సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (13:25 IST)

గోంగూర, పచ్చిమిర్చి ఉడికించి ఇలా చేస్తే..?

గోంగూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గోంగూర రుచి కాస్తంత పులుపు, వగరు కలిసి ఉంటుంది. గోంగూరను విడిగా వండుకోవచ్చు లేదా.. పప్పు, మాంసాహారాలతో కలిపి వండినా రుచిగా ఉంటుంది. రుచిపరంగా గోంగూర గురించి తెలుసుకోవడం ఎంత ప్రియమో.. ఆరోగ్యపరంగా తెలుసుకోవడం కూడా అంతే ప్రియమూ.. 
 
గోంగూరలో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గోంగూరలోని ఐరన్ రక్తహీనతను సమర్థంగా నివారిస్తుంది. అంతేకాకుండా.. అనీమియా వ్యాధిగ్రస్తులకు ఇది మంచి స్వాభావికమైన ఔషధమని చెప్పొచ్చు. గోంగూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలకు ఎంతగానో దోహదం చేస్తుంది. దాంతో పాటు ప్రేగుల కదలికలు సమర్థంగా జరిగేలా చూస్తుంది. 
 
అధిక బరువును తగ్గించాలంటే.. కప్పు గోంగూరను కొన్ని పచ్చిమిర్చి, నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత నీటిని మాత్రం వంపేసి గోంగూరను, పచ్చిమిర్చిని కాస్త కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి. ఆ తరువాత కొద్దిగా ఉప్పు, కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసి కలపాలి. ఈ పచ్చడిని వేడివేడి అన్నం కలిపి కొద్దిగా నెయ్యి వేసి తింటుంటే.. నోటికి రుచిగా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని వారంలో రెండు రోజులైనా తింటే.. బరువు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
గోంగూరలోని విటమిన్ సి శరీర రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాదు.. కంటి వ్యాధులను నివారించడంతో పాటు చూపును దీర్ఘకాలం పదిలంగా కాపాడుతుంది. గోంగూరకు శరీరంలోని చెడు కొవ్వును అరికట్టే శక్తి ఉంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. దీనిలోని మెగ్నిషియం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలానే మేని నిగారింపునకు, జుట్టు నిగనిగలాడడానికి కూడా సహాయం చేస్తుంది.