ఏకాదశి ఉపవాసం... ఎంతటి ప్రయోజనమో తెలుసా?
ఈ నెల 25వ తేదీ అంటే బుధవారం ఏకాదశి. ఆ రోజున ఉపవాసం చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. సాధారణంగా ఏదైనా రోగానికి మందు లేనప్పుడు, ఉపవాసము చేసి రోగనిరోధక శక్తిని పెంచుకుని రోగం రాకుండా చేయడం లేదా రోగాన్ని జయించడం చేయొచ్చు.
ఉపవాసము అనేది రోగ నిరోధక శక్తిని పొందడానికి ఒక పద్ధతి. ఆహారము తీసుకొనే సమయములలో నియంత్రణను పాటీంచడమే ఇందులోని ముఖ్యమైన అంశం. ఉపవాసములు చేసే పద్దతులలో రెండు వారాలకు ఒకసారి ఏకాదశి రోజున చేసే ఉపవాసము మంచి ప్రయోజనాలను ఇస్తుంది.
ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే.. ఉపవాసం అనేది ఒక వ్యాధిని తగ్గించడానికి చికిత్సా విధానము కాదు. కానీ శరీరములో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి చక్కగా దోహదపడే సాధనం మాత్రమే.
ఏకాదశి రోజున ఉపవాసం ఎలా చేయాలి?
ఏకాదశి రోజున ఉదయాన్నే అంటే 4 నుండి 5 గంటల మధ్యన నిద్రలేచి కాలకృత్యములు, వ్యాయములు, స్నానము పూర్తిచేసి 6 గంటలకు 2 గ్లాసులు గోరు వెచ్చటి నీరు త్రాగాలి. ఆ రోజు చేయగలిగిన వారు ఒక పూట లేదా రోజంతా (ఇంతకు ముందు ఉన్న అలవాటును బట్టి ) ఉపవాసము చేయాలి.
ఉండగలిగిన వారు 10 గంటల పాటు (పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు) నీరు కూడా తాగాకుండా ఉంటే శరీరానికి చక్కటి నిరోధక శక్తి వస్తుంది. అయితే, పది గంటల పాటు ఉపవాసం చేయదలచిన వారు ఉదయాన్నే 6 గంటలకు 2 గ్లాసుల గోరు వెచ్చటి నీరు తాగాలి. మళ్ళీ సాయంత్రము నాలుగు గంటల తర్వాత 2 గ్లాసుల గోరువెచ్చటి నీటిని సేవించాలి.
ఒక పూట ఉపవాసం ఉందాము అనుకున్నవారు మాత్రం సాయంత్రము 6 గంటలకు (18.30 సమయమునకు) సాత్వికమైన మితాహరము తీసుకోవాలి. రాత్రి 10 గంటలలోపునే నిద్రపోవాలి. ఈ ఉపవాసం అనేది ఏదేని వ్యాధిని తగ్గించడానికి చికిత్సా విధానం కాదు. కానీ శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
బాలలు, గర్భవతులు, బిడ్డలకు పాలు ఇచ్చే తల్లులు, ఏదైనా అనారోగ్యము లేదా వ్యాధితో బాధపడే వారు ఇంకా దీర్ఘకాలిక రోగముల ఉన్నవారు, ఇది చేయక పోవడం మంచిది. ఈ ఉపవాసాన్ని స్వయంగా ఎవరికి వారే ఆచరించి ఫలితాన్ని పొందవచ్చు.