ఈ ఉప్పు వున్నది చూశారూ...
ఉప్పుతో ఆరోగ్యం ఎన్నో తిప్పలకు గురవుతోంది. భోజనంలో రోజుకు సుమారు 1 నుంచి 2 గ్రాముల ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇతర ఆహారపదార్థాలలో కన్పించకుండా ఉండే ఉప్పు ఎంతో ఎక్కువగా ఉంటుంది. వంటలలోనూ, ఊరగాయ పచ్చళ్లు, మజ్జిగలో కలుపుకుని ఉప్పు అన్నీ కలిసి సుమారు 25 గ్రాముల వరకూ చేరుతుంది. మన శరీర అవసరాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇలా ఎక్కువ మోతాదులో ఉప్పును తీసుకుంటే శరీరానికి జరిగే హాని ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.
ఉప్పు ఎంత ప్రయోజనకారి అయినా మోతాదుకు మించితే అనర్థదాయకమవుతుంది. శరీరంలో అనేక అనారోగ్యాలకి మూలకారణం ఉప్పును ఎక్కువగా వాడటమే. ఉప్పు వల్ల కలిగే విపరీత పరిణామాల్లో అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, స్ట్రోక్, కీళ్ల నొప్పులు, గర్భిణులలో టాక్సిమా, చెమట పట్టడం తగ్గిపోవడం, ఊపిరితిత్తుల్లో శ్లేష్మం పెరగడం, నాడీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
అదేవిధంగా కాళ్లు- చేతులు- ముఖం ఉబ్బరించడం, శరీరంలో నీటి పరిమాణం పెరిగి స్థూలకాయం ఏర్పడటం, మూత్రపిండాలలో సోడియం నిల్వలు ఎక్కువై రక్తపోటు రావడం, ఫలితంగా శారీరక ద్రవాలు ఎక్కువగా నిల్వ అవడం ద్వారా రక్తపోటు చివరికి గుండెపోటుకు దారితీయవచ్చు. కనుక ఉప్పును తగిన మోతాదులో మాత్రమే వినియోగించాలి.