సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 17 డిశెంబరు 2021 (17:37 IST)

కీళ్ల వాపులు, ఆధునిక చికిత్సలే మేలు

కీళ్ల వాపులు (ఆర్థరైటీస్‌) అంతర్జాతీయంగా వైకల్యానికి అతి ప్రధానమైన కారణాలలో ఒకటిగా నిలుస్తుంది. సాధారణంగా మోకీళ్లపై  ప్రభావం చూపే స్థితి ఇది. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 మిలియన్‌ల మంది ఆస్టియో ఆర్థరైటీస్‌తో బాధపడుతుంటే వీరిలో 2.6 మిలియన్ల మంది మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలను చేయించుకుంటున్నారు. 

 
భారతదేశంలో,ఇది మహమ్మారి దశకు చేరుకుంటుంది. దాదాపు 15 మిలియన్ల మంది ప్రజలు ఆర్థరైటీస్‌తో బాధపడుతుంటే, 0.17 మిలియన్‌ మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ప్రతి సంవత్సరం భారతదేశంలో జరుగుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణంగా ఊబకాయం, నిశ్చల జీవనశైలి, వ్యాయామాలు తగినంతగా చేయకపోవడం.

 
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే 15 రెట్లు అధికంగా మన దగ్గర ఆర్థరైటీస్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపాలంటే ప్రజలకు తగిన అవగాహన కల్పించడం ఓ మార్గం. సాంకేతికంగా అత్యాధునిక ఆవిష్కరణలైనటువంటి రోబోటిక్స్‌ మరీ ముఖ్యంగా కీళ్లు, తుంటి మార్పిడి విభాగంలో రావడం వల్ల దీర్ఘకాలం ఆర్థరైటీస్‌తో బాధపడుతున్న రోగుల జీవితాలలో ఆశలు చిగురుస్తున్నాయి. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆర్థోపెడిక్‌ ప్రక్రియల్లో కీళ్ల మార్పిడి విజయవంతమైన ప్రక్రియగా కొనసాగుతున్నప్పటికీ ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనలు అత్యుత్తమ ఫలితాలకు తోడ్పడుతున్నాయి.

 
మోకీళ్లు లేదా తుంటి మార్పిడి శస్త్రచికిత్స అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. దీనికి  ప్రత్యేకమైన శిక్షణ, శస్త్రచికిత్స నైపుణ్యం అవసరం పడుతుంది.  కీళ్లమార్పిడి శస్త్రచికిత్సలో కృత్రిమ కీలును ఖచ్చితమైన స్థానంలో అమర్చే విధానం మెరుగైన ఫలితాలనందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్స్‌రే, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ వంటివి కీళ్లకు ఎంత మేరకు నష్టం జరిగిందనేవి చూపుతాయి.

 
సంప్రదాయ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ఈ అంశాలపై ఆధారపడటంతో పాటుగా ఆపరేషన్‌ టేబుల్‌ వద్దకు వచ్చిన తరువాత సర్జన్‌ తగిన ప్రణాళికలు చేయడం జరుగుతుంటుంది. కానీ నేడు, అత్యాధునిక స్మార్ట్‌ రోబోటిక్స్‌ అయినటువంటి మాకో రోబోటిక్‌ ఆర్మ్‌ అసిస్టెడ్‌ టెక్నాలజీ తో ఈ ప్రణాళికను ముందుగానే చేయవచ్చు. ఈ సాంకేతకతల కారణంగా ఆస్టియోఫైట్స్‌, సిస్ట్స్‌, బోన్‌ డిఫెక్ట్స్‌ను శస్త్రచికిత్సకు ముందుగా గుర్తించవచ్చు. వ్యాధి బారిన పడిన కీలు 3డీ మోడల్‌ సృష్టించడంతో పాటుగా ప్రతి రోగికీ వ్యక్తిగతీకరించిన వర్ట్యువల్‌ సర్జికల్‌ ప్లాన్‌ను సాఫ్ట్‌వేర్‌ సృష్టిస్తుంది. దీనివల్ల సర్జన్‌ పూర్తి ఖచ్చితత్త్వంతో చికిత్స చేయడం వీలవుతుంది.

 
ఇప్పటికే హైదరాబాద్‌లో 1000 మందికి పైగా రోగులు రోబోటిక్‌ ఆర్మ్‌ సహాయక సాంకేతికత ప్రయోజనాలను పొందారు. హాస్పిటల్‌లో గడిపే సమయం తగ్గడం, అతి తక్కువ నొప్పి, ఎముకలు, మృదుకణజాల నష్టం తక్కువగా ఉండటం, రక్త స్రావం తక్కువగా జరగడం వల్ల త్వరగా కోలుకోగలుగుతున్నారు.
 
- డాక్టర్‌ ఏ.వీ. గురవారెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌, సన్‌షైన్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌