మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?
చిత్తూరు జిల్లాలో ఓ పరువు హత్య జరిగింది. మతాంతర వివాహం చేసుకున్న కుమార్తెను తల్లిదండ్రులు ఇంటికి పిలిచారు. చివరకు ఆ యువతి అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. అయితే, కన్నవారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
స్థానిక బాలాజీ నగర్‌కు చెందిన యాస్మిన్ బాను (26) ఎంబీఏ పూర్తి చేసింది. బీటెక్ చదివిన సాయితేజ్‌తో కాలేజీ రోజుల్లోనే ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో వారిద్దరూ వివాహానికి సిద్ధమయ్యారు. అయితే, సాయితేజ ఎస్సీ వర్గానికి చెందిన యువకుడు కావడంతో యాస్మిన్ తల్లిదండ్రులు షౌకత్ అలీ, ముంతాజ్‌లు ఈ వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ ఈ యేడాది ఫిబ్రవరి 9వ తేదీన నెల్లూరు వివాం చేసుకున్నారు. తమ తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని అదే నెల 13వ తేదీన తిరుపతి డీఎస్పీని కలిసి విన్నవించారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
అయితే, కొన్ని రోజులుగా యాస్మిన్ కుటుంబ సభ్యులు ఫోనులో కుమార్తెతో మాట్లాడటం మొదలుపెట్టారు. తండ్రి షౌకత్ అలీకి ఆరోగ్యం బాగాలేదని, ఒకసారి వచ్చి చూసి వెళ్లాలని యాస్మిన్‌ను పదేపదే కోరారు. దీంతో ఆదివారం ఉదయం సాయితేజ తన భార్యతో కలిసి చిత్తూరులోని గాంధీ విగ్రహం కూడలి వద్దకు వెళ్లి ఆమె సోదరుడి కారు ఎక్కించి తల్లిగారింటికి పంపారు. ఆ తర్వాత కాసేపటికే సాయితేజ తన భార్యకు ఫోన్ చేస్తే కలవలేదు. దీంతో అనుమానం వచ్చి నేరుగా వారింటికి వెళ్లారు. యాస్మిన్ ఇంట్లో లేదని ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
దీంతో పరుగుపరుగున ఆస్పత్రికి వెళ్లిన సాయితేజ అక్కడి మార్చురీలో తన భార్య మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయాడు. తన భార్యను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ సాయితేజ ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే, పరారీలో ఉన్న యాస్మిన్ తండ్రి షౌకత్ అలీ, ఆమె పెద్దమ్మ కుమారుడు లాలూ, ఇతర కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు.