మీడియాలో నిజాయితీ లోపించింది.. టీవీ జర్నలిస్టుపై ట్రంప్ ఫైర్.. ఎందుకు?
మీడియాకు నిజాయితీ లేదని రిపబ్లికన్ పార్టీ నుంచి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో, మీడియాలో నిజాయితీ లోపించిందని, అంతేగాకుండా ఓ టీవీ జర్నలిస్టును అనైతికి వ్యక్తి అంటూ ఆరోపించారు.
మంచి పనులు పట్ల సైతం తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సిగ్గు పడాలని ట్రంప్ ఫైర్ అయ్యారు. ఏబీసీ న్యూస్ జర్నలిస్ట్ టామ్ లలామస్‌ను ప్రస్తావిస్తూ అతడిది అనైతికి ప్రవర్తన అని, అతడికి నిజానిజాలేంటో తెలుసని ట్రంప్ మండిపడ్డారు. మీడియాపై మున్ముందు కూడా దాడి చేస్తూనే ఉంటానని ట్రంప్ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
మంగళవారం న్యూయార్క్‌లో ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్ పత్రికల్లో, టీవీల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ట్రంప్ సేకరించిన ఆరు మిలియన్ డాలర్ల నిధుల గురించి అడిగిన మీడియాపై చిందులుతొక్కారు.