సౌది రాజు కుటుంబంలో 150 మందికి కరోనా.. దీవిలో సౌదీ రాజు స్వీయ నిర్బంధం
కరోనా వైరస్ సౌది రాజకుటుంబాన్ని ముసురుకుంది. ఆ కుటుంబంలో ఏకంగా 150 మందిని పట్టేసింది. అయితే ఈ వ్యవహారం ఆ దేశ నేతలను, రాజ ప్రతినిధులను వణికిస్తోంది.
ఎందుకంటే రెండు వారాల క్రితం వారంతా రాజ కుటుంబంతో సన్నిహితంగా మెలగడమే. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్(ఎన్‌వైటీ) పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే ఆ దేశ ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. రియాద్ గవర్నర్ ఫైసల్ బిన్‌కు కరోనా సోకడంతో ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు.
ఫైసల్ బిన్(72) వయసులో పెద్దవాడు కావడంతో అతన్ని ఐసీయుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇప్పటికే సౌదీ రాజు సల్మాన్(84), యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌లతో పాటు మిగతావారు ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు.
సౌదీ రాజు సల్మాన్ జెడ్డాకు సమీపంలోని ఒక దీవిలోని రాజప్రాసాదంలో ఇప్పటికే స్వీయ నిర్బంధం విధించుకోగా.. రాజకుమారుడు సల్మాన్, తన కుమారుడు, ఇతర మంత్రులతో కలిసి అదే దీవిలోని మరోచోట ఉన్నట్లు ఎన్‌వైటీ స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే సౌదీలో ప్రఖ్యాత మక్కా, మదీనాలను ప్రజలెవరు సందర్శించకుండా మార్చి మొదటివారంలోనే మూసివేశారు.
సౌదీ రాజులు వేల సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారు క్రమం తప్పకుండా యూరోప్ దేశాలకు వెళ్లివస్తుంటారు. కాగా విదేశాల్లో వైరస్ బారిన పడే అవకాశం ఉండడంతో ఇప్పటికే వారందరిని సౌదీకి తీసుకువచ్చి క్వారంటైన్‌లో ఉంచారు.
కరోనా విజృంభిస్తోన్నసమయం కావడంతో దేశం వెలుపల, అలాగే సౌదీ ప్రావిన్సుల మధ్య ప్రయాణాలు చాలావరకు పరిమితం చేశారు.
అలాగే సౌదీలోని నాలుగు గవర్నెన్పెలతో పాటు ఐదు ప్రధాన నగరాలు 24 గంటల లాక్‌డౌన్‌లో ఉంచబడినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. కాగా ఇప్పటివరకు సౌదీలో 2932 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 41కి చేరింది.