శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (14:42 IST)

భూమి కంటే చంద్రుడే యమ డేంజర్.. అంతరిక్ష పరిశోధకలు హెచ్చరిక

blue moon
భూమండలంపై ఏదో ఒక ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకుంటాయి. ఇది సర్వసాధారణం కూడా. ప్రకృతి విపత్తుల్లో భాగంగా, అపుడపుడూ భూమి కంపిస్తుంది. తాజాగా మొరాకో దేశంలో సంభవించిన భూకంపంలో అపారమైన ప్రాణనష్టం వాటిల్లింది. అయితే, భూమి కంటే చంద్రమండలం యమ డేంజర్ అంటున్నారు అంతరిక్ష పరిశోధకులు. అక్కడ భూకంప తీవ్రత భూమిపై వచ్చేదాని కంటే 20 రెట్లు అధికంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణాలను కూడా వారు వివరిస్తున్నారు. 
 
భూమితో పోలిస్తే చంద్రుడి భౌగోళిక నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది.. అయినా అక్కడ తరచూ భూకంపాలు సంభిస్తుంటాయని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కోసారి వాటి తీవ్రత భూమిపై కన్నా 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇటీవల చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ అక్కడ భూ ప్రకంపనలకు సంబంధించిన సంకేతాలను గుర్తించిందని చెప్పారు.
 
గతంలో అమెరికా చేపట్టిన అపోలో 17 ప్రాజెక్టులో చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాములు అక్కడ కొన్ని సిస్మోమీటర్లను వదిలి వచ్చారు. చంద్రుడిపై భూకంపాలకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ సిస్మోమీటర్లు కేవలం ఐదేళ్లు మాత్రమే పనిచేశాయి. ఆ ఐదేళ్ల కాలంలోనే చంద్రుడిపై సుమారు 12 వేలకు పైగా భూకంపాలు, భూ ప్రకంపనలు నమోదు చేసినట్లు నాసా వెల్లడించింది. ఈ సిస్మోమీటర్లు అందించిన సమాచారం ఆధారంగా చంద్రుడిపై నాలుగు రకాల భూకంపాలు సంభవిస్తాయని కనుగొన్నట్లు తెలిపింది.
 
ఆ నాలుగింటిలో ఒకటి లోతైన భూకంపం, రెండోది తేలికపాటి భూకంపం, మూడోది నిస్సార భూకంపం, నాలుగోది థర్మల్ భూకంపం.. చంద్రుడిపై అత్యంత లోతైన భూకంపాలు సాధారణమని, ఇవి ఉపరితలం నుంచి 700 కిలోమీటర్ల లోతు వరకు సంభవిస్తాయని అంతరిక్ష పరిశోధకులు చెప్పారు. చంద్రుడిపై ఉల్కలు ఢీ కొనడం, ఉపరితలంపై ఉష్ణోగ్రతలలో కలిగే మార్పులు తదితర కారణాల వల్ల భూకంపాలు సంభవిస్తాయని వివరించారు. తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 పాయింట్లుగా నమోదైందని, ఈ భూకంపాలు 10 సెకన్ల నుంచి 30 సెకన్లు ఉంటాయని తెలిపారు. మరికొన్ని రెండు నిమిషాల పాటు కొనసాగుతాయని వివరించారు.