జపాన్‌లో డ్రైవర్ రహిత బుల్లెట్ రైళ్లు!!
జపాన్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బుల్లెట్ రైలు. ప్రపంచ వ్యాప్తంగా జపాన్ బుల్లెట్ రైలుకు అంత ప్రజాదారణ ఉంది. బుల్లెట్ రైళ్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న జపాన్.. ఇపుడు డ్రైవర్ రహిత బుల్లెట్ రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. వచ్చే 2030 నాటికి జపాన్‌లో డ్రైవర్లు లేకుండా బుల్లెట్ రైళ్లు నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. తూర్పు జపాన్ రైల్వేలో తొలిసారిగా వీటిని ప్రవేశపెట్టనున్నారు.
2028 నాటికి ఒక మార్గంలో నడిచే రైళ్లలో డ్రైవరు సేవలు పూర్తిగా ఆటోమేటెడ్ కానున్నాయని.. అయినప్పటికీ డ్రైవర్లు క్యాబిన్‌లోనే అందుబాటులో ఉంటారని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఆ తర్వాత యేడాది నుంచి డ్రైవర్ రహిత రైళ్ల ట్రయల్స్‌ను నిర్వహించి 2030 మధ్య నాటికి టోక్యో - నిగాటా మధ్య జోట్సు మార్గంలో పూర్తిస్థాయి డ్రైవర్ లెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.
కార్మికుల కొరత వంటి సమస్యలను పరిష్కరించడంలో ఈ రైళ్లు సహాయపడతాయని రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు. జపాన్ దేశంలో జనాభా క్షీణిస్తుండటంతో ఇప్పటికే అక్కడి అనేక రంగాలు కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. భవిష్యత్‌లో బుల్లెట్ రైళ్లన్నీ డ్రైవర్ రహితంగా నడిచేలా చర్యలు చేపట్టారు.