ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 13 జులై 2024 (18:42 IST)

జపాన్: మనుషులకన్నా వేగంగా పెరుగుతున్న ఎలుగుబంట్ల జనాభా, కాల్చివేత చట్టాల సవరణకు ప్రయత్నాలు

bears
జనావాసాలలో ఎలుగుబంట్ల దాడులు పెరిగిపోవడంతో, వాటిని కాల్చి చంపే నిబంధనలను సరళతరం చేయాలని జపాన్ భావిస్తోంది. అయితే వేటగాళ్లు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఈ ఏడాది ప్రారంభం నుంచి ఏప్రిల్ వరకు, జపాన్‌లో రికార్డు స్థాయిలో 219 ఎలుగుబంట్ల దాడులు జరిగాయి. వాటిలో ఆరు ప్రాణాంతకమైనవి. ఇటీవలి కాలంలో ఎలుగుబంట్లు ఎక్కువగా జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నందున ఇలాంటి దాడులు పెరిగిపోయాయి. కొంతమంది ఇవి మనుషులను లక్ష్యంగా చేసుకున్నాయని భావిస్తున్నారు.
 
జపాన్‌లో మనుషుల సగటు జీవితకాలం పెరిగి, జనాభా తగ్గిపోతుండగా, ఎలుగుబంట్ల సంఖ్య మాత్రం పెరిగిపోతోంది. ముఖ్యంగా నగరాలకు దూరంగా ఉన్న ప్రాంతాలలో ఇది ఎక్కువగా ఉంది. ప్రస్తుత చట్టాల ప్రకారం, లైసెన్స్ పొందిన వేటగాళ్ళు పోలీసుల ఆమోదం తర్వాతే తమ తుపాకులతో ఎలుగుబంట్లను కాల్చవచ్చు. ఆయుధాలను మరింత స్వేచ్ఛగా ఉపయోగించేందుకు వీలుగా ప్రభుత్వం తదుపరి పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాన్ని సవరించాలని యోచిస్తోంది. ఉదాహరణకు, ఒక ఎలుగుబంటి భవనంలోకి ప్రవేశించి, మనుషులకు హాని కలిగించే ప్రమాదం ఉంటే వాటిని కాల్చేందుకు వేటగాళ్ళకు అనుమతిస్తారు. కానీ వేటగాళ్ళు మాత్రం దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
 
"ఎలుగుబంటిని ఎదుర్కోవడం చాలా ప్రమాదకరం. వాటిని కాల్చి చంపేయగలమని హామీ ఇవ్వలేం." అని హక్కైడో హంటర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సతోషి సైటో అన్నారు. "ఎలుగుబంటిని నిర్వీర్యం చేయడానికి మనం దాని శరీరంలోని ముఖ్యమైన భాగాన్ని కాల్చలేకపోతే, అది పారిపోయి, మిగతా వ్యక్తులపై దాడి చేస్తుంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?" అని ఆయన ప్రశ్నించారు.
 
రెండింతలైన ఎలుగుబంట్ల సంఖ్య
1990 నుంచి జపాన్‌లో ఉత్తరాన ఉన్న ప్రధాన ద్వీపంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం మనుషుల జనాభా తగ్గి, ఎలుగుబంట్ల సంఖ్య రెండింతలు పెరిగింది. ఇక్కడ ఇప్పుడు దాదాపు 12,000 గోధుమ రంగు ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటికి నల్ల ఎలుగుబంట్ల కంటే దూకుడు ఎక్కువ. నిపుణుల అంచనా ప్రకారం జపాన్‌లో దాదాపు 10,000 నల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. ఈ ఎలుగుబంట్లను జనావాసాలకు దూరంగా ఉంచడానికి స్థానిక ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి.
 
కొన్ని చోట్ల రోబో తోడేళ్ళతో వాటిని బెదిరించడానికి ప్రయత్నిస్తుండగా, మరికొన్ని చోట్ల కృత్రిమ మేధస్సు ఆధారిత హెచ్చరిక వ్యవస్థను పరీక్షిస్తున్నారు.
హక్కైడోలోని నయీ పట్టణ వీధుల్లో పెట్రోలింగ్ చేయడానికి, ఉచ్చులు వేయడానికి, అవసరమైతే వాటిని చంపడానికి రోజుకు సుమారు 5 వేల రూపాయల వరకు చెల్లించి వేటగాళ్లను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిలో రిస్క్ ఎక్కువగా ఉండడం, వేతనాలు తక్కువగా ఉండడం, వేటగాళ్లలో చాలామంది వృద్ధులు కావడం వల్ల సరైన ఫలితాన్ని ఇవ్వడం లేదు.
 
జనవాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి?
"ఎలుగుబంటిని ఎదుర్కోవడం అంటే మన ప్రాణాలను పణంగా పెట్టడమే" అని ఆ ప్రాంతానికి చెందిన ఒక వేటగాడు అన్నారు. ఎలుగుబంట్లతో తలపడటాన్ని ఆయన అమెరికా మిలిటరీ కమాండోలతో తలపడటంతో పోల్చారు. గత మేలో ఉత్తర అకిటా ప్రాంతంలో ఎలుగుబంటి దాడిలో మరణించినట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తి మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఇద్దరు పోలీసు అధికారులు ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. "మనుషులు ఉన్నారని తెలిస్తే ఎలుగుబంట్లు వారి దగ్గరున్న ఆహారం కోసం దాడి చేస్తాయి. లేదా వాళ్లనే ఆహారంగా భావిస్తాయి." అని స్థానిక ప్రభుత్వ అధికారి మామి కొండో చెప్పారు. "ఒకే ఎలుగుబంటి వరుస దాడులు చేసే అవకాశం చాలా ఉంది." అని అన్నారు.
 
ఎలుగుబంట్ల సంఖ్య పెరగడంతో వాటిలో చాలా ఎలుగుబంట్లు పర్వతాల నుంచి జనావాసాలకు దగ్గరగా వచ్చాయి. కాలక్రమేణా, అవి మనుషులను చూడటానికి, వాళ్ల శబ్దాలకు అలవాటు పడి, మనుషులంటే భయం తగ్గింది. యువకులు పెద్ద నగరాలకు తరలివెళ్లడంతో చిన్న పట్టణాలలో మనుషులూ తగ్గిపోయారు, దీంతో మనుషులను ఎదుర్కొన్నప్పుడు ఎలుగుబంట్లు హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాయి. "పట్టణ ప్రాంతాల్లోకి ప్రవేశించే ఎలుగుబంట్లు భయాందోళనలకు గురవుతాయి, అలాంటప్పుడు ప్రజలకు గాయాలు తగలడం లేదా మరణించే ప్రమాదం ఉంది." అని జపాన్‌లోని పిచియో వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన జున్‌పీ తనకా చెప్పారు.
 
ఆహారం కోసం వెతుకుతూ..
ఎలుగుబంట్లు సాధారణంగా ఏప్రిల్‌లో నిద్రాణస్థితి(హైబర్‌నేషన్ ) నుంచి మేల్కొన్నప్పుడు ఆహారం కోసం వెతుకుతూ కనిపిస్తాయి. ఆ తర్వాత మళ్లీ సెప్టెంబరు, అక్టోబర్‌లలో చలికాలం కోసం కొవ్వును నిల్వ చేసుకోవడానికి వాటికి ఆహారం కావాల్సి వస్తుంది. ఆ సమయంలో బయటికి వచ్చినప్పుడు మనుషుల కంటపడతాయి. వాతావరణ మార్పుల కారణంగా ఎలుగుబంట్లకు అతిపెద్ద ఆహార వనరు అయిన సింధూర కాయలు తగ్గడంతో వాటి కదలికలను అంచనా వేయలేకపోతున్నారు.
 
"చట్టానికి ఈ సవరణ అనివార్యం. అయితే ఈ పని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలి." అని తనకా చెప్పారు. జంతువులను పట్టుకోవడం, చంపడం ఈ సమస్యకు పరిష్కారాలు కాదని ఆయన అన్నారు. దానికి బదులుగా, ఎలుగుబంట్లు సంచరించే ప్రదేశాలను ప్రభుత్వం సంరక్షిస్తే, అవి ఆహారం కోసం దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదని కొంతమంది వాదిస్తున్నారు. "దీర్ఘకాలంలో అటవీ వాతావరణాన్ని మార్చేందుకు, అధిక జీవవైవిధ్యంతో అడవులను సృష్టించే విధానాన్ని అమలు చేయాలి." అని అన్నారు తనకా.
 
జనావాసాలలో సంచరించే ఎలుగుబంట్ల బాధ్యతను స్థానిక అధికారులు తీసుకోవాలా లేక వేటగాళ్ల అన్నదానిపై కూడా ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. "నిజానికి, అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించే శిక్షణ పొందిన ప్రభుత్వ వేటగాళ్లు ఉండాలి, కానీ ప్రస్తుతం జపాన్‌లో అలాంటి ఉద్యోగాలు లేవు." జనావాసాలలో వేటాడడం వేటగాళ్లకు అలవాటు లేదు. జనం లేని ప్రాంతాల్లో ఎలుగు బంట్లను చంపడమే వారికి తెలుసు.’’ సైటో చెప్పారు. "కాల్చకపోతే ప్రజలు మమ్మల్ని విమర్శిస్తారు. తుపాకీ ఉన్నా ఎందుకు కాల్చలేదు అంటారు. అదే మేము కాల్చినప్పుడు జనానికి ఏదైనా ప్రమాదం మళ్లీ మా మీదే విమర్శలు చేస్తారు’’ సైటో అన్నారు. "అందువల్ల ఏదో మామూలు జీతాలు తీసుకునే వేటగాళ్ళను ఇలాంటి కీలకమైన పనులు చేయమని చెప్పడం అసమంజసమని నేను భావిస్తున్నాను." అని తనకా అభిప్రాయపడ్డారు.