సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (17:40 IST)

గూగుల్ మ్యాప్ ద్వారా భార్య అక్రమ గుట్టును రట్టు చేసిన భర్త...

గూగుల్ మ్యాప్స్ వల్ల మనకు ఎక్కడికైనా వెళ్లడానికి మార్గాలు తెలుస్తాయి. కానీ ఒక వ్యక్తి మాత్రం గూగుల్ మ్యాప్స్‌తో తన భార్య అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేసాడు. ఈ సంఘటన పెరూలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తి లైమాలోని ఒక ప్రముఖ బ్రిడ్జ్‌కు వెళ్లేందుకు మార్గాలను వెతకడానికి గూగుల్ స్ట్రీట్ వ్యూ ఓపెన్ చేసి చూస్తుండగా ఒక వీధిలో రోడ్డు పక్కన ఉన్న బల్లపై ఒక మహిళ కూర్చుని ఉండగా ఒక వ్యక్తి ఆమె ఒడిలో తలపెట్టుకుని  పడుకుని ఉండే చిత్రం కనిపించింది. అయితే సాధారణంగా అందులో కనిపించే వ్యక్తుల ముఖాలను గోప్యత కోసం గూగుల్ బ్లర్‌గా ఉంచినప్పటికీ, ఆ మహిళ దుస్తులు, ఆకృతి అచ్చం తన భార్యలాగే ఉండటంతో అతనికి అనుమానం మొదలైంది.
 
ఆ అనుమానంతోనే ఆ ఫోటోల గురించి ఆరా తీయడం మొదలు పెట్టాడు. ఈ ఫోటోలను 2013లో బ్యూరాన్ డి లాస్ సస్ఫిరోస్ డీ బార్రాకో వద్ద తీసినట్లు తెలుసుకుని, ఆ ఫోటోల్లో ఉన్నది తన భార్యే అని నిర్ధారించుకున్నాడు. ఆపై ఆ వ్యక్తి తన భార్యను నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో అప్పటి నుండి వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇటీవలే ఆ జంట విడాకులు కూడా తీసుకున్నట్లు డైలీ మెయిల్ యూకే ఒక కథనంలో తెలియజేసింది.