శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (10:17 IST)

తల్లిని చూసేందుకెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చిన భార్య.... ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త...

కన్నతల్లిని చూసేందుకు పుట్టింటికని వెళ్లిన భార్య.. చెప్పిన సమయం కంటే 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందన్న అక్కసుతో భర్త ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ఎటాహా పట్టణానికి చెందిన ఓ వివాహిత తన అమ్మను చూసేందుకు పుట్టింటికి వెళ్లాలని భావించింది. ఈ విషయం భర్తకు చెప్పడంతో వెళ్లి సరిగ్గా 30 నిమిషాల్లో తిరిగి రావాలని చెప్పాడు. కానీ, ఆమె భర్త చెప్పిన సమయం కంటే 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. 
 
ఇంటికి వచ్చిన భార్యను చూడగానే భర్త ఆగ్రహించాడు. ఆ తర్వాత తన సోదరుడి మొబైల్ నంబరుకు ఫోన్ చేసి తలాఖ్ తలాఖ్ తలాఖ్ అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో నిర్ఘాంతపోయిన భార్య న్యాయం కోసం అధికారులను ఆశ్రయించింది. 
 
గతంలో తన పుట్టింటి నుంచి భర్త కట్నం తీసుకురాలేదని అత్తింటివారు తనను కొట్టారని, తనకు గతంలో దీనివల్ల అబార్షన్ కూడా జరిగినట్టు వాపోతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ట్రిపుల్ తలాక్ ఉదంతంపై తాము దర్యాప్తు చేస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని అలీగంజ్ ఏరియా అధికారి అజయ్ భదారియా చెప్పారు.