1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (08:29 IST)

మయన్మార్‌లో మారణహోమం... ప్రజలను పిట్టల్లా కాల్చిపారేసిన సైన్యం..

మయన్మార్‌లో ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసింది. ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దేశ ప్రజలను పిట్టల్లా కాల్చిపారేసింది. ఫలితంగా మయన్మార్‌ దేశ సైన్యం మారణహోమం సృష్టించింది. సైన్యం కాల్పుల్లో దాదాపుగా 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ఇటీవల మయన్మార్ దేశ పాలనా పగ్గాలను ఆ దేశ సైన్యం తమ చేతుల్లోకి తీసుకున్న విషయం తెల్సిందే. ఆందోళనకారులపై మారణహోమం సాగిస్తోంది. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు వచ్చిన అంబులెన్స్‌ సిబ్బంది, కవరేజీలో ఉన్న విలేకరులపైనా దాడి చేసింది. బుధవారం ఒక్క రోజే.. ఫేస్‌బుక్‌, స్థానిక మీడియా బయట పెట్టిన ఆధారాల మేరకు పోలీసులు 38 మంది ఆందోళనకారులను కాల్చి చంపారు. 
 
బుధవారం ఉదయం 9 గంటలకు పలు ప్రాంతాల్లో ఆందోళనకారులపై పోలీసులు టియర్‌గ్యాస్‌, రబ్బర్‌ బుల్లెట్లతో విరుచుకుపడ్డారు. సాయంత్రం 5 గంటల సమయంలో.. మిలటరీ సైనికులు రంగప్రవేశం చేశారు. పోలీసులు రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగిస్తుండగా.. సైనికులు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే ఆటోమేటెడ్‌ గన్స్‌తో కాల్పులు జరిపారు. 
 
ఒక్క యాంగాన్‌లోనే 18 మంది మృతిచెందినట్లు సోషల్‌మీడియా, స్థానిక మీడియాలో ప్రసారమైన కథనాలు, వీడియో ఫుటేజీలు వెల్లడిస్తున్నాయి. మృతుల్లో 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మాండలే, మోన్యవా నగరాల్లో జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఆందోళనకారులు మృతిచెందారు. 
 
ఈ మారణకాండను 'రక్తపాత దినం' అని ఐక్యరాజ్య సమితి మయన్మార్‌ అధికార ప్రతినిధి క్రిస్టిన్‌ స్కారనర్‌ అభివర్ణించారు. ఆందోళనలతో సంబంధం లేని వారిపైనా పోలీసులు విరుచుకుపడ్డారు. యాంగాన్‌లో క్షతగాత్రులకు సాయం చేసేందుకు వచ్చిన ముగ్గురు అంబులెన్స్‌ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆందోళనలను కవర్‌ చేస్తున్న ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేశారు.