శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (16:10 IST)

మార్స్‌పై తొలి అడుగు వేయబోతోంది మహిళేనట!

భారత్, అమెరికా వంటి దేశాలు అరుణగ్రహంపైకి (మార్స్) స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపించాయి. మనిషి జీవించడానికి అక్కడి వాతావరణం అనుకూలంగా ఉందా లేదా అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలు కాస్తా పూర్తయినట్లయితే, మనిషిని మార్స్‌పైకి పంపించేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళికను రచిస్తున్నారు. 
 
అయితే మార్స్ గ్రహంపై తొలిసారి అడుగుపెట్టబోయేది మాత్రం ఓ మహిళ అని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్‌స్టైన్ పేర్కొన్నారు. చంద్రుడిపై మరోసారి అడుగుపెట్టబోయే తొలి వ్యక్తి కూడా మహిళే. అలాగే మార్స్‌పైకి వెళ్లేది కూడా మహిళే కావచ్చు అని ఆయన అన్నారు.
 
సైన్స్ ఫ్రైడే అనే సైన్స్ అండ్ టెక్నాలజీ రేడియో టాక్ షోలో బ్రైడెన్‌స్టైన్ మాట్లాడుతూ.. మార్స్‌పై ఎవరు అడుగుపెట్టనున్నారన్న విషయాన్ని చెప్పకపోయినా.. రాబోయే రోజుల్లో నాసా చేపట్టబోయే అన్ని ప్రధాన ప్రాజెక్ట్‌లలో మహిళలే ఎక్కువగా ఉంటారని చెప్పాడు. ఈ నెల చివర్లో తొలిసారి మహిళా వ్యోమగాములు మాత్రమే స్పేస్‌వాక్ చేయనున్నారు. 
 
ఆనె మెక్‌క్లెయిన్, క్రిస్టినా కోచ్ ఏడు గంటల పాటు సాగే ఈ స్పేస్‌వాక్‌కి సిద్ధమవుతున్నారు. వీళ్లద్దరూ 2013లో ఆస్ట్రోనాట్‌లుగా శిక్షణ పొందారు. ఈ మధ్యకాలంలో నాసా నిర్వహిస్తోన్న ఆస్ట్రోనాట్ క్లాస్‌లకు ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరుకావడం విశేషం. కాబట్టి రానున్న రోజుల్లో నాసా ప్రధాన ప్రాజెక్ట్‌లలో ఈ మహిళలే కీలకపాత్ర పోషించనున్నారు. ప్రస్తుతం మొత్తం నాసా వ్యోమగాములలో 34 శాతం మహిళలే ఉండటం గమనార్హం.