పూడ్చిపెట్టిన శవం తల నరికి ఎత్తుకెళ్లారు.. ఎవరు?
భారతదేశం ఓ వైపు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంటే, ఇంకా చేతబడులు చేయడం వంటి మూఢనమ్మకాలతో తిరోగమిస్తోంది. అలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. శ్మశానంలో పాతిపెట్టిన శవాన్ని దుండుగులు బయటకు తీసి, తల తీసుకుపోయిన సంఘటన కర్ణాటకలోని నెలమంగల తాలూకా భైరనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.
భైరనహళ్లి గ్రామంలో నివాసం ఉంటున్న అరసయ్య (65) వయోభారంతో జనవరి 13న మృతి చెందాడు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు గ్రామ శివారులో పాతిపెట్టారు. అయితే మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శవాన్ని బయటకు తీసి తల నరికి ఎత్తుకెళ్లిపోయారు.
బుధవారం ఉదయాన్నే శ్మశానం వైపు వెళ్లిన స్థానికులు తన లేని శవాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే నెలమంగల రూరల్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కుటుంబసభ్యులు మొండాన్ని తిరిగి పూడ్చిపెట్టారు. బుధవారం నాడు అమావాస్య కావడంతో చేతబడి చేయడం కోసం మాంత్రికులు ఈ చర్యలకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.