అమెరికా ఉపాధ్యక్ష పదవికి భారత సంతతి నేత పేరు ప్రతిపాదన
అమెరికా అధ్యక్ష పదవికి భారత సంతతి నేత, కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్ పేరు ప్రతిపాదనకు వచ్చింది. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డెమోక్రాట్ల అభ్యర్థి జోయ్ బిడెన్.. స్వయంగా ఉపాధ్యక్ష పదవికి కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు.
ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఫియర్ లెస్ లేడీగా గుర్తింపు పొంది, దేశంలోని అద్భుతమైన ప్రజా సేవకుల్లో ఒకరైన కమలా హారిస్ పేరును తాను ఉపాధ్యక్ష పదవికి ప్రతిపాదించడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని జోయ్ బిడెన్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
తన పేరును వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేట్ చేయడం తనకు దక్కిన గౌరవమని కమలా హారిస్ అన్నారు. బిడెన్ ను కమాండర్-ఇన్-చీఫ్ గా అభివర్ణిస్తూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు.
కమలా హారిస్ తల్లిదండ్రులు ఎన్నో దశాబ్దాల క్రితమే అమెరికాకు వలస వచ్చారు. తండ్రి జమైకన్ కాగా, తల్లి ఇండియన్. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళ కమలా హారిస్. యుఎస్ సెనెట్‌కు ఎన్నికైన తొలి దక్షిణాసియా దేశాల సంతతి కూడా ఆమె కావడం గమనార్హం.