మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 25 మే 2020 (19:51 IST)

ఉదయగిరికి తాగునీరందించే వ్యవస్థపై అధ్యయనం చేయండి: ఉపరాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.. ఉదయగిరి నియోజకవర్గం ఎదుర్కుంటున్న సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు.

సోమవారం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్,  కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కార్యదర్శి యూపీ సింగ్, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ తో ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన సమావేశంలో ఉదయగిరి ప్రజలు ఎదుర్కుంటున్న నీటి సమస్యలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. 
 
కరువుపీడిత ప్రాంతమైన ఉదయగిరికి తాగు, సాగునీటిని అందించే సాధ్యాసాధ్యాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. లాక్ డౌన్ తర్వాత.. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా (1978లో) ఎన్నికైన ఉదయగిరి ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో వారు.. అక్కడి నీటి ఎద్దడి పరిస్థితులను ఉపరాష్ట్రపతికి ఏకరువుపెట్టారు.

భూగర్భజలాలు అడుగంటడంతో చెరువులు, బోరుబావులు ఎండిపోయాయని తెలిపారు. వరుసగా ఏడో ఏడాదీ సరిగ్గా వర్షాలు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది నుంచైనా లేదా.. సోమశిల ప్రాజెక్టునుంచైనా తమకు నీటిని ఇప్పించాలని వారు ఉపరాష్ట్రపతిని కోరారు.
 
ఈ నేపథ్యంలో జరిగిన సోమవారం నాటి సమావేశంలో.. ఉదయగిరికి నీటిని అందించేందుకు సాంకేతిక సంభావ్యత (టెక్నికల్ ఫీజిబిలిటీ), సవివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అంశాలపై చర్చించాలని అధికారులకు ఉపరాష్ట్రపతి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నీటి కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనితీరును కూడా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు.

జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారులు, నీతి ఆయోగ్ అధికారుల బృందం ఉదయగిరిలో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడితే వాస్తవ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసేందుకు వీలవుతుందన్నారు. దీనికి అధికారులు స్పందిస్తూ.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, వీలుచూసుకుని తప్పక ఉదయగిరిలో పర్యటిస్తామని, అక్కడి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 
 
సంప్రదించి.. సరైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. పర్యటన అనంతరం తదుపరి వివరాలతో మరోసారి కలుస్తామని ఉపరాష్ట్రపతికి విన్నవించారు. ఈ కార్యక్రమలో ఉపరాష్ట్రపతి కార్యదర్శి  ఐవీ సుబ్బారావు కూడా పాల్గొన్నారు.
 
అనంతరం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనూ ఉపరాష్ట్రపతి ఫోన్లో మాట్లాడారు. ఉదయగిరి ప్రజలు తనతో పంచుకున్న తీవ్ర నీటి ఎద్దడి అంశాన్ని, సోమవారం జల్ శక్తి సీనియర్ అధికారులు, నీతి ఆయోగ్ సీఈవోతో జరిగిన సమావేశం వివరాలను పంచుకున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ఉదయగిరి సమస్యకు పరిష్కారం లభించవచ్చని ఆశాభావం ఉపరాష్ట్రపతి వ్యక్తం చేశారు. దీనికి సీఎం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. కేంద్రంతో కలిసి పనిచేస్తూ ఉదయగిరికి నీటి సమస్య పరిష్కారానికి చొరవతీసుకుంటామని ఉపరాష్ట్రపతికి హామీ ఇచ్చారు.