కరోనా లాక్ డౌన్- జీహాదీలను రిక్రూట్ చేసుకుంటున్న ఉగ్రవాద సంస్థలు
పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్ధీన్ ఉగ్రవాద సంస్థలు జిహాదీలను రిక్రూట్‌మెంట్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని సౌత్ ఏసియా డెమోక్రటిక్ ఫ్రంట్ రీసెర్చ్ డైరెక్టరు డాక్టర్ సియజ్ ఫ్రైడ్ వోల్ప్ చెప్పారు. కరోనా లాక్ డౌన్ అమలులో ఉన్న ప్రస్థుత కష్టకాలంలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు యువకులకు తినడానికి భోజనం, కొంత డబ్బు ఇచ్చి వారిని తమ సంస్థల్లో చేర్చుకుంటున్నారని సమాచారం.
కరోనా వల్ల యువత ఉపాధికి విఘాతం కలిగిన తరుణాన్ని ఆసరాగా తీసుకొని ఉగ్రవాదులు జిహాద్ ప్రచారంతో ఉగ్రసంస్థల్లో వారిని చేర్చుకుంటున్నట్లు వోల్ప్ తెలిపారు. కరోనా కష్టకాలంలో దీన్ని ఆసరాగా తీసుకొని యువతను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారని పాకిస్థానీ జర్నలిస్టు ఒకరు చెప్పారు. దక్షిణ ఆసియా పరిధిలోని ప్రత్యేకించి ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో కరోనా వైరస్ విపత్తు కారణంగా తమ జీవనోపాధి కోల్పోయిన యువతను ఆకర్షిస్తున్నట్లు వోల్ఫ్ తెలిపారు.