శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:24 IST)

భారత్‌కు డబ్బులు అక్కర్లేదు.. క్రికెటర్ల ప్రాణాలు ఫణంగా పెట్టలేం : కపిల్ దేవ్

భారత్‌కు డబ్బులు అక్కర్లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్ల ప్రాణాలను ఫణంగా పెట్టలేమని భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. కరోనాపై పోరాటానికి అవసరమైన నిధులను ఇండోపాక్ క్రికెట్ సిరీస్ ద్వారా సేకరించాలన్న పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదనపై కపిల్ దేవ్ స్పందించారు. మూడు వన్డేల సిరీస్‌ను దుబాయ్‌ లాంటి తటస్థ వేదికపై  ఖాళీ స్టేడియంలో  నిర్వహించాలన్నాడు. తద్వారా వచ్చే విరాళాలను ఇరు దేశాలకు సమానంగా పంచాలని సూచించాడు. 
 
ఈ ప్రతిపాదనపై భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ స్పందించాడు. భారత్‌కు డబ్బు అవసరం లేదన్నాడు. అదే సమయంలో క్రికెట్ మ్యాచ్‌ కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. 'క్రికెట్ సిరీస్ అనేది అక్తర్ అభిప్రాయం మాత్రమే. కానీ, మనం ఇప్పుడు విరాళాలు సేకరించాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్బు ఉంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అందరూ కలిసి కట్టుగా పనిచేయడమే ఇప్పుడు ముఖ్యం' అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.