శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (17:06 IST)

పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొచ్చుకొస్తున్న కొత్త శత్రువులు

భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య నిత్యం ఉద్రిక్తతలు నెలకొనివుంటాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న కాశ్మీర్ కీచులాటను తీర్చేందుకు పలు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ దేశాల రాయబారాన్ని భారత్ తోసిపుచ్చుతోంది. ఫలితంగా ఇరు దేశాల సరిహద్దుల్లో పాక్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. భారత్ మాత్రం ఎల్లవేళలా సంయమనం పాటిస్తూ ముందుకు సాగుతోంది. మరోవైపు, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రేరేపిస్తోంది. ఫలితంగా ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండిపోతోంది. 
 
ఈ పరిస్థితుల్లో పాక్ నుంచి భారత్‌కు సరికొత్త ముప్పు ఏర్పడింది. పాకిస్థాన్ రైతులను హడలెత్తిస్తున్న రాకాసి మిడతలు ఇప్పుడు సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాయి. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంటపొలాలపై దాడి చేస్తూ చేతికొచ్చిన పంటను కత్తిరించి వేస్తున్నాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి ఇవి భారత్ భూభాగంలో ప్రవేశిస్తున్నట్టు గుర్తించారు. 
 
పాకిస్థాన్‌లో ఇప్పటికే మిడతలపై ఎమర్జెన్సీ ప్రకటించారు. రాజస్థాన్‌లోని 12 జిల్లాలపై ఈ పాక్ మిడతల ప్రభావం ఎక్కువగా ఉంది. గత రెండున్నర దశాబ్దాల్లో ఇంతటి విపత్తు ఎప్పుడూ రాలేదని భారత్ రైతులు వాపోతున్నారు. ఈ మిడతల దండును తరిమేందుకు రైతులు పెద్ద శబ్దంతో పాటలు పెట్టడం, ఫైర్ ట్యాంకర్ల సాయంతో కెమికల్స్ స్ర్పే చేయడం వంటి నివారణ చర్యలు పాటిస్తున్నారు. 
 
అయితే పొరుగున ఉన్న పాకిస్థాన్ కూడా సరైన నివారణ చర్యలు చేపడితేనే వీటి ముప్పు తగ్గుతుందని భారత్ రైతులు అభిప్రాయపడుతున్నారు. అటు, పాకిస్థాన్ లో సైతం పరిస్థితి ఇదేవిధంగా ఉంది. మిడతలు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తుండడంతో జాతీయ స్థాయిలో అత్యయిక స్థితి ప్రకటించాల్సి వచ్చింది.