శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2022 (09:04 IST)

యుద్ధంలో పాల్గొనాలంటూ నోటీసు.. తన వల్ల కాదంటూ ఆత్మహత్య.. ఎక్కడ?

Russia-Ukraine war
రష్యా సైనికులు బలంవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అధికారదాహంతో పెట్రేగిపోతున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిరి పుతిన్ ఉక్రెయిన్ దేశంపై దండయాత్ర చేస్తున్నారు. గత ఫిబ్రవరి నెల నుంచి సాగుతున్న ఈ యుద్ధంలో రష్యా సేనలు విజయం సాధించలేక తోకముడిచాయి. 
 
అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, ఉక్రెయిన్‌‍పై అదును చిక్కునపుడల్లా దండయాత్ర చేస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే అనేక మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశ పౌరులు యుద్ధం చేసేందుకు రావాలంటూ రష్యా ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. దీంతో పలువురు యువకులు యుద్ధానికి భయపడి ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
తాజాగా రష్యన్ సైన్యంలో చేరి ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పోరాడాలంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన నోటీసు అందుకున్న ఓ డిస్క్ జాకీ (డీజే) భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
కొన్ని నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో రష్యా ఇప్పటికీ పై చేయి సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసి ఉక్రెయిన్‌పై పైచేయి సాధించేందుకు వీలుగా నిర్బంధ సైనిక సమీకరణ చేపట్టింది. ఇందులోభాగంగా, అనేక మంది పౌరులకు సైన్యంలో చేరాలంటూ నోటీసులు పంపిస్తుంది. ప్రభుత్వం నుంచి అందుతున్న నోటీసులపై ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుంది. పైగా, సైన్యంలో చేరాల్సి వస్తుందన్న కారణంతో అనేక మంది దేశాన్ని వీడుతున్నారు. 
 
ఈ క్రమంలోనే క్రాస్నోడార్‌ నగరానికి చెందిన 27 ఏళ్ల ర్యాపర్ డీజే ఇవాన్ విటలీవిచ్ పెటునిన్‌కు కూడా ప్రభుత్వం నుంచి నోటీసు అందింది. వాకీ పేరుతో స్టేజి షోలు ఇచ్చే ఈ డీజే.. యుద్ధం పేరుతో ప్రత్యర్థుల ప్రాణాలు తీసేందుకు తాను సిద్ధంగా లేనంటూ ఓ భారీ భవనంలోని 10వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
అంతకుముందు అతడు ఓ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. పాక్షిక సైనిక సమీకరణ అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ త్వరలోనే అది పూర్తిస్థాయిలో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశాడు. పుతిన్‌ను యుద్ధ ఉన్మాదిగా అభివర్ణించిన పెటునిన్.. ఈ వీడియోను మీరు చూసే సమయానికి తాను సజీవంగా ఉండనని పేర్కొన్నాడు.