సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

సింగపూర్‌లో భారతీయ వ్యక్తికి ఉరిశిక్ష అమలు

tangaraju suppaiah
సింగపూర్‌లో భారతీయ వ్యక్తిని ఉరితీశారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో పట్టుబడి దోషిగా తేలడంతో ఈ శిక్షను అమలుచేస్తారు. ఈ కేసులో ఆయనకు విధించిన మరణశిక్షను తగ్గించుకునేందుకు న్యాయపరంగా జరిగిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతడు ఉరికంబం ఎక్కాల్సి వచ్చింది. ఈ శిక్షపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వచ్చినప్పటికీ సింగపూర్‌ ప్రభుత్వం మాత్రం ఉరిశిక్షను అమలు చేసింది.
 
భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య గత 2014లో గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టు అయ్యాడు. ఒక కేజీ గంజాయిని సింగపూర్‌కు అక్రమంగా తరలిస్తున్నాడన్న అభియోగాలు అతడిపై నమోదయ్యాయి. ఈ కేసులో అతడికి అక్టోబర్‌ 9, 2018లో మరణశిక్ష పడింది. మరో ఇద్దరితో కలిసి తంగరాజు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరించినట్లు నిర్ధారించిన న్యాయస్థానం.. అతడికి శిక్ష విధించింది. డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తిని ఉరితీయడం ఇది రెండోసారి.
 
అయితే, ఈ కేసు విచారణ ప్రమాణాలకు అనుగుణంగా జరగలేదని, ఓ అమాయకుడిని సింగపూర్ చంపబోతోందని ఇదివరకు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ శిక్షపై బ్రిటన్‌ బిలియనీర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. యూరోపియన్ యూనియన్‌, ఆస్ట్రేలియా ఆయనకు మద్దతుగా నిలిచాయి. 
 
కానీ బ్రాన్సన్‌ ప్రకటనను సింగపూర్ ఖండించింది. ఆయన వ్యాఖ్యలు సింగపూర్‌ న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను కించపరిచేలా ఉన్నాయని మండిపడింది. మాదకద్రవ్యాలకు సంబంధించి స్థానిక చట్టాల ప్రకారమే అతడికి ఉరిశిక్ష అమలు చేస్తున్నామని సింగపూర్‌ ప్రభుత్వం స్పష్టం చేసి ఉరిశిక్షను అమలు చేసింది.