బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (19:18 IST)

మంచు.. మంచు.. ఎటు చూసినా మంచు : మంచుగడ్డలా అమెరికా!

అగ్రరాజ్యం అమెరికా మంచుగడ్డలా మారిపోయింది. ఎటు చూసినా మంచు మినహ మరొకటి కనిపించడం లేదు. ఇంటి బెడ్ రూం ఫ్యాన్ సహా అన్నీ మంచు గడ్డల్లా మారిపోతున్నాయ్. ఎటు చూసినా.. మంచు మంచు. తాగడానికి గ్లాస్ నీళ్లు లేవు. తాగే నీరుకూడా మంచు గడ్డలా మారిపోయింది. పవర్ గ్రిడ్లు ఫెయిలై రోజుల తరబడి కరెంటు కూడా లేకపోవడంతో అగ్రరాజ్యం, ముఖ్యంగా టెక్సాస్ ప్రాంత పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ మంచు తుఫాను ధాటికి ఇప్పటికే 62 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
మొత్తంగా అమెరికాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో నీరు ఎక్కడికక్కడ గడ్డ కట్టుకుపోయింది. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు ప్రభావానికి అప్రకటిత లాక్డౌన్ ఏర్పడింది. మంచు ధాటికి తట్టుకోలేక 60 మంది మృతి చెందారు. పరిస్థితి రోజు రోజుకు చేయి దాటిపోతోంది. రోజు వారి పనులకు అవసరమైన నీరు లేక, తాగడానికి గుక్కెడు నీళ్ళ కోసం అల్లాడిపోతున్నారు. మంచు తుఫాను ప్రభావం టెక్సాస్, హ్యుస్టన్‌లలో మరింత తీవ్రతరమైందని అంచనా వేస్తున్నారు అధికారులు. 
 
అక్కడ మంచి నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుఫాను కారణంగా మంచి నీటి పైపులలో ఉండే నీరు గడ్డ కట్టుకుని పోవడంతో నీటి సమస్య ఏర్పడింది. నిత్యావసరాలకు కాకపోయినా కనీసం తాగడానికి మంచి నీళ్ళు కావాలంటూ వేలాది మంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
 
 
ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ప్రభుత్వం మంచును కరిగించి ఆ నీటిని బాటిల్స్‌లో నింపి రోగులకు అందిస్తోంది. మంచు తుఫాను కారణంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో కొన్ని నగరాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. 
 
మంచుని కరిగించుకుని కాచి వడబోసి తాగడం తప్ప .. స్థానిక ప్రభుత్వాలు ఎలాంటి పరిష్కారం చూపలేక పోతున్నాయి. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే.. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో జనం అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మంచు గడ్డల మధ్య డాన్స్ చేస్తూ.. సరదా తీర్చుకుంటున్నారు.