మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (11:36 IST)

టెక్సాస్‌లో విషాదం... ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో విషాదకర ఘటన జరిగింది. ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా నారాయణపేట జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
 
ఈ జిల్లాలోని మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి, లక్ష్మి దంపతుల పిల్లలు మౌనిక, భరత్ ఇద్దరు టెక్సాస్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. 4 నెలల క్రితం నరసింహా రెడ్డి, లక్ష్మి టెక్సాస్‌లోని తమ కొడుకు, కూతురు వద్దకు వెళ్లారు. 
 
తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో వారు నలుగురు పాల్గొని, తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నరసింహా రెడ్డి, ఈయన భార్య లక్ష్మితో పాటు కుమారుడు భరత్ అక్కడికక్కడే మృతి చెందారు. 
 
కూతురు మౌనికకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నరసింహా రెడ్డి ఆర్టీసీ కండక్టర్‌గా హైదరాబాద్ డిపో -1 లో విధులు నిర్వహించేవాడు.