సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 జులై 2024 (14:15 IST)

రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగల శక్తి భారత్‌కు ఉంది : అమెరికా

modi - putin
గత కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపగల శక్తి భారత్‌కు ఉందని అగ్రరాజ్యం అమెరికా వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై శ్వేతసౌధం ప్రతినిధి జాన్ పియర్ స్పందిస్తూ రష్యాతో భారత్‌కు బలమైన దౌత్య సంబంధాలు ఉన్నాయని అందువల్ల రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగల శక్తి భారత్‌కు ఉందని చెప్పారు. 
 
ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై స్పందించిన భారత్ ప్రధాని నరేంద్ర మోడీ అమాయక చిన్నారులు ఈ యుద్ధంలో బలవడం భయానకమని, వేదన కలిగిస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఆసుపత్రిపై దాడి జరిగిన అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన శ్వేత సౌధం ప్రతినిధి భారత్ తలుచుకుంటే యుద్ధం ఆపగలదని వ్యాఖ్యానించారు.
 
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే తన రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాక ఇరు దేశాధినేతలు సమావేశం అవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోడీని పుతిన్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు. కాగా. మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచీ ఇప్పటివరకూ పుతిన్‌న్ను 16 సార్లు కలిశారు. ఇక పుతిన్ చివరిసారిగా భారత్‌లో 2021 డిసెంబరులో పర్యటించారు.