ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By
Last Modified: శనివారం, 8 డిశెంబరు 2018 (21:15 IST)

వర్మ ఓ వేస్ట్ ఫెలో... ఎన్టీఆర్ బయోపిక్ తీయడమేంటి?

ఈ నెల 9న ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... 
 
జయలలితగారు వందేళ్ళ పండుగ బాధ్యత మీపై పెట్టడానికి కారణం ఏమిటి?
ఆమెకు నాపైవున్న నమ్మకం. కొడుకులా చూసేది. హైదరాబాద్‌లో ఆమెకు చెందిన ఓ గార్డెన్‌ విషయాన్ని డీల్‌ చేశా. అప్పటినుంచి ఆమెతో జర్నీ కొనసాగింది. ఈ నెల 5న ఆమె చనిపోయిన రోజు. నా మాతృమూర్తి అమ్మగా జన్మనిస్తే జీవితంలో ఇంతకంటే జన్మలేదురా! అనే స్థితిని జయలలిత అమ్మ కల్గించింది. భారత చనలచిత్ర రంగంలో అమితాబ్‌, రేఖ, కమల్‌హాసన్‌, రజనీ, విజయ్‌.. వంటి మహామహులున్న చోట కళ్యాణ్‌ అనే రేణువుకు తరాలు చెప్పుకునే ఉత్సవాన్ని నిర్వహించే బాధ్యత కల్పించడం అదృష్టం. 
 
ఇక జాతీయ స్థాయిలో ఫెడరేషన్‌ బాధ్యత ఎలా వచ్చింది?
సౌత్‌ అధ్యక్షుడిగా చేశాక జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేసింది. ఇందుకు కొంతమందికి ఈర్ష్య వుంది. ఏది ఏమైనా పదవి ఏదీ కావాలని పరుగెత్తలేదు. వాటంతటవే నాకు దక్కాయి. ప్రస్తుతం వరల్డ్‌ సినిమాకు చెందిన 143 కంట్రీస్‌కు చెందిన 'పియాప్‌' అనే సంస్థ వుంది. దానికి భారత్‌ తరపున నేను సభ్యుడ్ని. మొదటిసారి మీటింగ్‌లో అమెరికా వారితో ఫైట్‌ చేశాను. మా దేశం నుంచి చాలా సినిమాలు చేస్తున్నాం. మాకెందు ప్రాధాన్యత ఇవ్వలేదని అడిగేవాడిని. అందుకు పాకిస్తాన్‌ చలనచిత్ర రంగం సపోర్ట్‌ చేసేది. ఈ వరల్డ్‌ సంస్థకు కొన్ని విధులున్నాయి.
 
గోవా ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌గానీ ఏదైనా ఫెస్టివల్‌ జరగాలన్నా, మన సినిమాలు ఆస్కార్‌కు నామినేట్‌ కావాలన్నా వరల్డ్‌ సంస్థ 'పియాప్‌' షెడ్యూల్‌ ఇవ్వాలి. ఇంతకుముందు ఆ పదవిలో ఎవరూ లేరు. 'బాహుబలి' వచ్చినా వారిలో మార్పులేదు. ఇటీవలే ఆస్కార్‌ కాంపిటీషన్‌లో 'విలేజ్‌ రాక్‌స్టార్స్‌'కు నామినేట్‌ చేశాం. ఒక్కమాటలో చెప్పాలంటే.. మన సినిమా వరల్డ్‌ స్థాయిలో తెలియాలంటే భారత ప్రభుత్వం సహకరించాలి. దీనికి మన ప్రభుత్వం సహకారంలేదు. ప్రభుత్వం దీనికి ఫండ్‌ ఇవ్వాలి. మన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో పోటీలో వున్నప్పుడు అక్కడి మెంబర్లకు చూపించాలి. దానికి ఖర్చు అవుతుంది.

ప్రభుత్వం ఇందుకు కోటి ఇవ్వాలనుకుంది. అది కూడా చాలదు. పైగా మన సినిమాలకు ఫారిన్‌ టెక్నీషియన్స్‌ పనిచేస్తే ఆస్కార్‌ అవార్డులకు వారు సహకరిస్తారు. 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌'కు ఇదే పని జరిగింది. పైగా ఇంటర్‌నేషనల్‌ పెస్టివల్స్‌ అంటే బ్యూరోక్రాట్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారనే అపోహతో ప్రభుత్వం వుంది. ప్రభుత్వం సినిమా పరిశ్రమను పట్టించుకోవడంలేదు. మోడీ వచ్చినప్పుడు చైనాలా ఇండియాలో థియేటర్లు పెంచాలన్నారు. ఇంతవరకు అతీగతీలేదు. ఎవరి స్వార్థం వారిది. రాజకీయాల్లో తలమునకలవుతూ సినిమాను చులకనగా చూస్తున్నారు.
 
మీమీద కొన్ని విమర్శలున్నాయి?
నేను భూకబ్జా చేశానని అప్పట్లో టీవీ9 ప్రసారం చేసింది. దాన్ని నిరూపించలేకపోయింది. తర్వాత భాను కిరణ్‌, మద్దెల చెరువు సూరి విషయంలో నాపై నిందలు పడ్డాయి. నాపై పెట్టిన కేసులు నీరుగారిపోయాయి. అదే టైంలో నట్టికుమార్‌ దాన్ని వాడుకుని ఛాంబర్‌, కౌన్సిల్‌ ఎన్నికల్లో నాపై పిచ్చి కేసులు పెట్టారు. ప్రూఫ్‌ లేక వాటిని కొట్టేశారు కూడా. అలాగే షాలిమార్‌ కంపెనీ 'ఖలేజా, కొమరం పులి' చిత్రాలు మా దగ్గర కొన్నారు. సినిమాలు ఆడకపోవడంతో డబ్బులు ఎగ్గొట్టాలని ఏదోవిధంగా నాపై కేసులు పెట్టారు. అప్పటి సిఐడికి చెందిన అధికారి రమణమూర్తి నాకు ఎన్నో ఇబ్బందులు కలిగించారు. 
 
చివరికి అది తప్పుడు కేసని జడ్జికి తెలిసింది. అందుకు రమణమూర్తికి ప్రతిఫలంగా దేవుడు వేరే రూపంలో అందించాడు. అలాగే నాకు పరిటాల రవితో మంచి సంబంధాలున్నాయి. మద్దెల చెరవు సూరిపై సినిమా తీస్తే.. వివేక్‌ ఓబ్‌రాయ్‌ను పరిటాల రవి ఇంటికి తీసుకెళ్ళా. అప్పుడు చాలామంది భయపెట్టారు. సునీత అక్క. శ్రీరాములు.. మమ్మల్ని బాగానే చూశారు. మా అన్న చేసిన పనులు బాగా హైలైట్‌ చేయాలి అన్నారు. అది వర్మ దర్శకుడిగా చేయాలని చెప్పాను. అందుకే నేను సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ రెడీ. నాకు తెలిసి ఏ తప్పు చేయను.
 
రాజశేఖర్‌తో 'కల్కి' తీస్తున్నారు. ఎంతవరకు వచ్చింది?
ఇక్కడో విషయం చెప్పాలి. జీవిత నాది అన్నాచెల్లెళ్ల సంబంధం. చిన్న వయస్సు నుంచీ ఆమె తమ్ముడు మురళీ నేను స్నేహితులం. వారింటోనే భోజనం చేసేవాడిని. సిస్టర్‌ నటిస్తే.. నేను ఆమె సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేశా. రాజశేఖర్‌ 'బొబ్బిలి వంశం' సినిమాతో నన్ను పెద్ద నిర్మాతగా మార్చాడు. ఆయనకు రుణపడి వున్నా. ఆ తర్వాత శ్రీహరి. హైదరాబాద్‌లో నా స్వంత ఆస్తి ఇది అని నాంది పలికింది శ్రీహరి వల్లే. ఇక కల్కి విషయానికి వస్తే కులుమనాలి షెడ్యూల్‌ అయింది. ఇంకా 40 రోజుల చిత్రీకరణ వుంది. ఈ నెల 12 నుంచి బదామి, మైసూర్‌, ఊటీ,హైదరాబాద్‌లో షూట్‌ చేయాలి. 
 
ఆమధ్య కొందరు పెద్ద నిర్మాతలు 'ఎల్‌ఎల్‌పి' అని కొత్తగా పెట్టారు. ప్రస్తుతం మూసేసినట్లు వార్తలు వచ్చాయి?
ఎల్‌ఎల్‌పికి బీజం పడినప్పుడు నేను బద్ద వ్యతిరేకిని. కొందరు ఎల్‌ఎల్‌పిగా ఏర్పడి వాణిజ్య ప్రకటన విషయంలో కంట్రోల్‌ చేయాలని చూశారు. అందులో ప్రధాన సభ్యుడు కొడాలి వెంకటేశ్వరావుకు నిర్మాత మండలిలో రిజైన్‌ చేసి దాన్ని నిర్వర్తించమని చెప్పా. వినలేదు. తర్వాత ఎన్‌టీవీ, టీవీ9 సహకారం వుందని విర్రవీగారు. చివరికి వారికే హ్యాండ్‌ ఇచ్చారని తెలిసింది. త్వరలోనే అందరికీ వాణిజ్య ప్రకటనలు ఇవ్వాలనే పాత పద్దతి వస్తుందని నమ్మకముంది. 
 
దాసరి తర్వాత ఇండస్ట్రీ దిక్కుగా ఎవరుంటే బాగుంటుందని భావిస్తున్నారు?
నాకు తెలిసి దీనికి అర్హుడు మెగాస్టార్‌ చిరంజీవిగారే. ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువ. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే బెటర్‌. చిరంజీవి గారిది పాజిటివ్‌ వైబ్రేషన్‌ వున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి డీల్‌ చేస్తేనే బాగుంటుంది. రామ్‌ చరణ్‌కు యూత్‌ హీరోలంతా స్నేహితులే. ఏ సమస్య వచ్చినా వారు సహకరించగలరు.
 
చిరంజీవి గారికి సమస్య చెప్పాలంటే 24 క్రాఫ్ట్‌కు చెందిన సభ్యులకు అందని ద్రాక్షే అవుతుందనే అపోహ వుందికదా?
మీరన్నట్లు ఒకరకంగా ఇబ్బందే. ఆయనకు చాలా పనులుంటాయి. అవన్నీ మానుకుని చూసుకోవాలి. పైగా కష్టం గురించి తెలిసిన వ్యక్తి ఆయన. చిరంజీవిని పెద్దస్థాయికి తీసుకు రావడానికి కారణం ఇండస్ట్రీనే. ఆరుగురు హీరోలు వున్నారంటే ఆయన వేసిన రక్తపు రోడ్డుమీద వీరంతా నడుస్తున్నారు. నాయకుడు అన్ని సైడ్‌లు ఆలోచించాలి. ఏదిఏమైనా అది ఆయన చేయగలడు. 
 
కొత్త చిత్రాలు?
రానా చిత్రం పూర్తయింది. సి.జి. వర్క్‌ జరుగుతుంది. 1945 పీరియాడికల్‌ ఫిలం అది. ధనుష్‌, నాగార్జున నటిస్తున్న సినిమా. తెలుగు వెర్షన్‌ నేనే చేస్తున్నా. నాగార్జున వర్క్‌ బ్యాలెన్స్‌ వుంది. తర్వాత బాలకృష్ణతో సినిమా చేస్తున్నా. బయోపిక్‌ అయ్యాక.. ఆయన ఎప్పుడు రెడీ అంటే నేను.. చేస్తా. రీసెంట్‌గా.. ఏదో ఇంటర్వ్యూలో నేను చేయబోయే లాస్ట్‌ నిర్మాత సి.కళ్యాణ్‌ అని చెప్పారట.. ఎందుకంటే ఆ తర్వాత ఆయన ఓన్‌ ప్రొడక్షన్‌ చేయాలనుకుంటున్నారట. 
 
వర్మ తీసే ఎన్‌టిఆర్‌ సినిమా కరెక్టేనా?
వేస్ట్‌ ఫెలో. ఆయనకు ఏదో కాంట్రవర్సీ కావాలి. అందుకే ఏదో చెబుతుంటాడు. ఇలాంటివి సొమ్ము చేసుకోలేం.. 'రక్త చరిత్ర 2' రిలీజ్‌ చేసేటప్పుడు ఆ కష్టం తెలిసింది. 'వంగవీటి' తీస్తుంటే వద్దని చెప్పినా వినలేదు. మనిషి మంచోడే గుణం గుడిచేటిది.. కానీ ఆయన డెడికేషన్‌ బాగుంటుంది. దాన్ని పాజిటివ్‌గా మారిస్తే ఇంకా పెద్ద పేరు తెచ్చుకోగలడు. 
 
మేఘాల్లో మీ పేరు వుండాలనే కోరిక నెరవేరుతుందా?
అతి త్వరలో నెరవేరుతుంది. త్వరలో దర్శకత్వం వహిస్తా. ఆ సినిమా గురించి చర్చించుకుంటారు. అలాంటి కథ అది. మంచి సినిమానే తీశాడనిపించేలా వుంటుంది. ఓ కథను కొన్నాను. చాలా బాగుంది. వినగానే దర్శకత్వం చేయాలనిపించింది. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తా అని ముగించారు.
-మురళీకృష్ణ