మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (14:58 IST)

18న చెన్నైలో ఐపీఎల్ వేలం : మాజీ పేసర్ శ్రీశాంత్ ఆశలు ఆవిరి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి రావాలనే టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఆశలు నెరవేరలేదు. అతనిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో 292 మందితో ప్రకటించిన తుది జాబితాలో శ్రీశాంత్‌కు చోటు దక్కలేదు. ఈ నెల 18న చెన్నైలో ఐపీఎల్ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. 
 
2013 ఐపీఎల్ ఎడిషన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్‌.. ఈ మధ్యే మళ్లీ కాంపిటీటివ్ క్రికెట్‌లోకి వచ్చాడు. కేరళ తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు. ఐదు మ్యాచ్‌ల్లో 18 ఓవర్లు వేసి 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.
 
మరోవైపు శ్రీశాంత్‌ను వద్దనుకున్న ఫ్రాంచైజీలు.. టెస్ట్ స్పెషలిస్ట్ చెటేశ్వర్ పుజారాపై మాత్రం ఆసక్తి చూపించాయి. దీంతో అతనికి 292 మంది లిస్ట్‌లో చోటు దక్కింది. పుజారా కనీస ధర రూ.50 లక్షలుగా నిర్ణయించారు. 
 
అటు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా రూ.20 లక్షల కనీస ధరతో ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో స్థానం సంపాదించాడు. అటు వేలం కోసం రిజిస్టర్ చేసుకున్న 42 ఏళ్ల ప్లేయర్ నయన్ దోషి కూడా రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో క్వాలిఫై కావడం విశేషం. ఇతడు టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి తనయుడు.